భక్తికి వశమైపోయే శంకరుడు

ఎంతోమంది దేవతలు తమకిగల దోషాల నుంచి ... శాపాల నుంచి బయటపడటానికి ఆదిదేవుడి పాదాలను ఆశ్రయించారు. అలాగే లోకకల్యాణాన్ని ఆశించిన ఎంతోమంది మహర్షులు తపస్సు ద్వారా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందారు. ఇక అసురులు కూడా ఆ దేవదేవుడిని గురించి తపస్సుచేసి ఆయన కరుణతో కావలసిన వరాలను సొంతం చేసుకున్నారు.

ఇలా పరమశివుడు తనని అంకితభావంతో పూజించినవారు ఎవరైనా వాళ్లను అనుగ్రహిస్తూ వచ్చాడు. రావణాసురుడు ... భస్మాసురుడు ... బాణాసురుడు ఇలా ఎంతోమంది అసురులకు ఆయన వరాలను అందించిన తీరు, భక్తికి శంకరుడు ఎంతగా వశమైపోతాడనేది స్పష్టం చేస్తుంటుంది.

ఒకసారి బలిచక్రవర్తి కొడుకైన 'బాణాసురుడు' పరమశివుడిని గురించి కఠోర తపస్సు చేస్తాడు. అసమానమైన భక్తిశ్రద్ధలతో ఆయన ఆచరిస్తోన్న తపస్సు సదాశివుడిని మెప్పిస్తుంది. దాంతో ఆయన బాణాసురుడి ఎదుట ప్రత్యక్షమై, కావలసిన వరాన్ని కోరుకోమని అడుగుతాడు. ఆదిదేవుడు సాక్షాత్కారం లభించినందుకు బాణాసురుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. అమ్మవారితో పాటు తన రాజ్యానికి విచ్చేయమనీ, తన కోటవాకిట కొలువుదీరి తమని సదారక్షిస్తూ ఉండమని కోరతాడు.

బాణాసురుడి కోరికను మన్నించిన పరమేశ్వరుడు ఆయన రాజ్యమైన 'శోణ పురం' లో అమ్మవారితో పాటు కొలువుదీరతాడు. దేవతలను ... మహర్షులనే కాదు, అసమానమైన భక్తిని ప్రదర్శించినది అసురులే అయినా ఆదిదేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ సంఘటలన్నీ కూడా భక్తికి శంకరుడు ఎంతగా వశమైపోతాడనే విషయాన్ని లోకానికి చాటుతుంటాయి.


More Bhakti News