దారిద్ర్యాన్ని నివారించే సదాశివుడు
సదాశివుడు సదా తన భక్తులను రక్షించే పనిలోనే వుంటాడు. ఆపదలోనో ... అవసరంలోనో వున్న తన భక్తులు పిలవగానే పరిగెత్తుకు వస్తూనే వుంటాడు. భక్తులు తమకి ఎంతో ముఖ్యమైనవిగా ... అత్యవసరమైనవిగా భావించే భవిష్యత్తుకు సంబంధించిన కోరికల దగ్గర నుంచి మోక్షం వరకూ ఆ దేవదేవుడు అనుగ్రహించనిది లేదు.
అడిగిన వెంటనే అనేక పుణ్యఫలితాలను అందజేస్తాడు కనుకనే ఆ స్వామిని భక్తులు ఆశ్రయిస్తుంటారు. ఈ కారణంగానే అనేక ప్రాంతాలలోని శివాలయాలు భక్తజన సందోహంతో కనిపిస్తుంటాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటి 'నేరేడుచర్ల' లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా పరిధిలో గల నేరేడుచర్లలో ఈ శివాలయం భక్తులపాలిట కొంగుబంగారమని చెబుతుంటారు.
సువిశాలమైన ప్రాంగణంలో గల ఈ ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. సోమవారాల్లోను ... విశేషమైన పర్వదినాల్లోను స్వామివారి పూజాభిషేకాల్లో విరివిగా పాల్గొంటూ వుంటారు. ఇక్కడి శివయ్యను పూజించడం వలన దారిద్ర్యం తొలగిపోతుందని చెబుతుంటారు.
దారిద్ర్యం ఎన్నో కష్టాలకు గురిచేస్తూ దుఃఖాన్ని కలిగిస్తూ వుంటుంది. దారిద్ర్యం ... దానివలన కలిగే దుఃఖం పరమశివుడి అనుగ్రహంతో నశిస్తాయి. అలా దారిద్ర్య దుఃఖాలను దూరంచేసేవాడిగా ఇక్కడి సదాశివుడిని చెప్పుకుంటారు. ఆ స్వామిని దర్శించి సేవించడం వలన సకల శుభాలు చేకూరతాయని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.