కర్పూర శివలింగ పూజా ఫలితం !

భక్తవత్సలుడైన పరమశివుడు భూలోకంలోని అనేక ప్రాంతాలలో లింగరూపంలో ఆవిర్భవించాడు. కాలకూట విషం కంఠంలో దాచుకున్నందువలన, దాని తీవ్రత ఆయనపై ప్రభావం చూపుతుంటుంది. ఆ వేడిని భరించడానికిగాను స్వామి చల్లదనాన్ని కోరుకుంటూ వుంటాడు. అందుకే అభిషేకాన్నీ ... చల్లదనాన్ని అందించే బిల్వపత్రాలను ప్రీతితో స్వీకరిస్తూ వుంటాడు.

సాధారణంగా శైవక్షేత్రాలలో నల్లరాయితోను ... తెల్లరాయితోను శివలింగాలు దర్శనమిస్తుంటాయి. ఇక భక్తులు ఆ స్వామిని అనునిత్యం పూజించుకోవడానికి గాను తమ పూజామందిరంలో బంగారు .. వెండి .. ఇత్తడి ... స్పటికతో చేయబడిన వివిధరకాల శివలింగాలను ఏర్పాటు చేసుకుంటూ వుంటారు. ఇక వివిధరకాల పదార్థాలతో చేయబడిన శివలింగాలను ఆరాధించడం వలన కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయనీ, ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని చెప్పబడుతోంది.

ఇలా మట్టితోను ... ఆవుపేడతోను ... బెల్లంతోను ... పిండితోను చేయబడిన శివలింగాలలో ఒక్కొక్కటి ఒక్కో విశేషమైన పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. ఆరోగ్యం ... ఆయుష్షు ... ఐశ్వర్యం .. కీర్తి ... ఇలా తమ మనోభీష్టానికి తగినట్టుగా భక్తులు ఆ శివలింగానికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది భక్తులు 'ముక్తి' ని కోరుకుంటూ వుంటారు.

అలా ముక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుడిని వేడుకునే భక్తులు ' కర్పూరం' తో చేసిన శివలింగాన్ని పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కర్పూరానికి గల విశిష్టత అంతా ఇంతా కాదు. అలాంటి కర్పూరంతో శివలింగాన్ని తయారుచేసి పూజించడం వలన, మంచులాంటి మనసున్న మహాదేవుడు మహదానందభరితుడై 'ముక్తి' ని ప్రసాదిస్తాడని చెప్పబడుతోంది.


More Bhakti News