భోగి పండుగ రోజున పొంగలి నైవేద్యం
తెలుగువారు జరుపుకునే పండుగలలో పెద్దపండుగగా 'సంక్రాంతి' కనిపిస్తుంది. భోగి ... సంక్రాంతి ... కనుమ అనే పేర్లతో ఈ పండుగను మూడురోజుల పాటు జరుపుకుంటూ వుంటారు. ఇక కొన్ని ప్రాంతాలలో 'ముక్కనుమ'ను కలుపుకుని నాలుగురోజుల పాటు ఈ పండుగ సంబరాలను జరుపుతుంటారు.ఈ పండుగ రోజులలో ముందుగా పలకరించే భోగి ... భోగభాగ్యాలను ఇస్తుందని అంటారు.
ధనుర్మాసం ముగిసేరోజుగా 'భోగి' కనిపిస్తుంది. ఈ మాసమంతా గోదా రంగానాయకుల కోసం ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహించి, భోగి రోజున వారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగవైభవంగా జరుపుతుంటారు. సాక్షాత్తు రంగనాయకస్వామి చేయిని అందుకుని గోదాదేవి భోగములను పొందిన రోజు కనుక ఈ రోజుని భోగిగా పిలుస్తుంటారని అంటారు. ఈ రోజున వైష్ణవ సంబంధమైన ఆలయాలన్నీ మరింత సందడినీ ... వైభవాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి.
ఈ రోజున తెల్లవారు జామునే ఇళ్లముందు భోగిమంటలు వేస్తారు ... ఆ తరువాత స్నానం చేసి నూతన వస్త్రాలను ధరిస్తారు. పంటలు ఇంటికి చేరతాయి ... పాడి సమృద్ధిగా వుంటుంది కనుక, కొత్తధాన్యంలో పాలను కలిపి 'పొంగలి' తయారుచేస్తారు. ఈ పొంగలిని తమ ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. భగవంతుడి అనుగ్రహంతో తమకి లభించిన పాడిపంటలతో తీపిపదార్థాన్ని తయారుచేసి, కృతజ్ఞతా పూర్వకంగా ఆ దైవానికి నైవేద్యంగా సమర్పించడం ఇందులోని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది.