అడిగిన వరాలను అందించే దేవుడు

శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపాన్ని ధరించినప్పుడు, ఆ రూపం చూసి పరమశివుడి మనసు చెదిరినప్పుడు కలిగిన తేజస్సు నుంచి మణికంఠుడు ఆవిర్భవిస్తాడు. అందుకనే ఆయనని హరిహర పుత్రుడని పిలుచుకుంటూ వుంటారు.

అలాంటి మణికంఠుడుని మంచిమనసుతో రాజశేఖర పాండ్యుడు చేరదీయడం, అక్కడ జరిగిన కుతంత్రాల కారణంగా మణికంఠుడు అడవులకు పంపబడటం జరుగుతుంది. విజయోత్సాహంతో తిరిగివచ్చిన మణికంఠుడు, దైవస్వరూపుడని గ్రహించి ఆయనని ఆరాధించడం జరుగుతుంది. అలా శబరిమలపై కొలువుదీరిన అయ్యప్పస్వామిని, దీక్షదారణ చేసిన భక్తులు ఏడాదికి ఒకసారి దర్శించుకుంటూ వుంటారు.

ఆ స్వామిని అనునిత్యం దర్శించుకుని పూజాభిషేకాలు జరిపించాలనే భక్తులు బలమైన సంకల్పం కారణంగానే వివిధ ప్రాంతాలలో అయ్యప్పస్వామి ఆలయాలు అలరారుతున్నాయి. అలాంటి అయ్యప్పస్వామి ఆలయాలలో ఒకటి 'కోదాడ' లో కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, అయ్యప్పస్వామి భక్తులతో సందడిగా వుంటుంది.

దీక్షధారణ ... పడిపూజలు ... ఇరుముడి కట్టుకోవడాలు ... భజన కార్యక్రమాలతో ఆలయం రద్దీగా వుంటుంది. అయ్యప్ప భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతూ వుంటుంది. సాధారణమైన రోజుల్లో స్వామివారికి బుధవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. స్వామివారికి అభిషేకం చేయించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి సకలశుభాలు చేకూరతాయని చెబుతుంటారు. అడిగిన వరాలను అందించే దేవుడిగా భక్తులు స్వామిపట్ల ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News