గోమాతలు ఎదురుపడితే అన్నీ శుభాలే !

ఏదైనా ఒక ముఖ్యమైన పనిపై బయటికి వెళ్లవలసి వచ్చినప్పుడు, మంచిశకునం చూసుకుని బయలుదేరడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది. శకునం మంచిదైతే తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తవుతుందనీ, లేదంటే అనేక అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయని భావిస్తుంటారు. అందుకే ప్రయాణమై మంచిశకునం కోసం ఎదురుచూస్తుంటారు.

ఆ సమయంలో ఆవులు ఎదురుగా వస్తూ కనిపించగానే కొంతమంది ఆలోచనలో పడతారు. అవి ఎదురుగా వస్తున్నప్పుడు బయలుదేరవచ్చునా లేదా అని సంశయిస్తుంటారు. ఆవు సాధుజీవి ... సకలదేవతా స్వరూపంగా అది పూజలు అందుకుంటూ వుంటుంది. ఆవుపాలు ... పెరుగు ... నెయ్యి భగవంతుడి ఆరాధనలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి.

ఆవు శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెప్పబడుతోంది. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీనివాసుడుగా భూలోకానికి వచ్చినప్పుడు, పుట్టలోని ఆ స్వామికి ఆవు పాలు ఇస్తుండగా ఆ పశువుల కాపరి దానిని కొడతాడు. అదే సమయంలో ఆ దెబ్బ ఆవుతో పాటుగా శ్రీనివాసుడికి తగులుతుంది. ఆయన తనకైన గాయం కన్నా, ఆవుకి తగిలిన దెబ్బగురించే ఎక్కువగా బాధపడతాడు.

ఉపకారమే తప్ప అపకారం తెలియని ఆవును కొట్టినందుకు ఆగ్రహోదగ్రుడై ఆ పశువుల కాపరిని శపిస్తాడు. దీనిని బట్టి భగవంతుడి దృష్టిలో గోవుకు గల స్థానం ఎంతటి ఉన్నతమైనదో అర్థంచేసుకోవచ్చు. అంతటి విశిష్టతను కలిగిన గోవులు ఎదురుపడినప్పుడు, ఎలాంటి సంశయము లేకుండా బయలుదేరవచ్చు. గోవుల శకునం శుభప్రదమైనదనీ, అవి ఎదురుగా వస్తున్నప్పుడు బయలుదేరడం వలన శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News