ఈ రోజున గుమ్మడిపండును దానంగా ఇవ్వాలి !
సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించడం వలన వచ్చేదే మకర సంక్రాంతి. ఇది పాడిపంటలకు సంబంధించిన పండుగ కావడం వలన, గ్రామాల్లో చేసే సందడి ఎక్కువగా వుంటుంది. ఈ సంతోషాల సందడిలో పాలుపంచుకోవడం కోసమే, ఎక్కడెక్కడో వున్నవాళ్లంతా తమ గ్రామాలకు చేరుకుంటూ వుంటారు.
ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ ఆరు నెలల పుణ్యకాలం దేవతలకు 'పగలు' గా చెప్పబడుతోంది. అందువల్లనే ఈ కాలంలో చేసే పూజాభిషేకాలను వాళ్లు ఆనందంగా స్వీకరించి అనతికాలంలోనే అనుగ్రహిస్తారని అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభయ్యే రోజుగా చెప్పబడుతోన్న సంక్రాంతి రోజున, దానధర్మాల వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయనే విషయం ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది.
సాధారణంగా శక్తి కలిగిన వాళ్లు ఈ రోజున గోవును ... బంగారాన్నీ ... వస్త్రాలను దానంగా ఇస్తుంటారు. ఇక ధాన్యంతో పాటు పండ్లు ... కూరగాయలను కూడా దానంగా ఇవ్వవచ్చని శాస్త్రం చెబుతోంది. ఒక్కో దానం వలన ఒక్కో ఉత్తమమైన ఫలితం కలుగుతుంది.
ఈ నేపథ్యంలో 'గుమ్మడి పండు' దానం మరింత విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. సంక్రాంతి రోజున 'గుమ్మడి పండు' ను దానంగా ఇవ్వడం వలన అపమృత్యు భయాలు దరిచేరవని చెప్పబడుతోంది. అందువలన అపమృత్యువు బారిన పడకుండా ఉండటం కోసం, సంక్రాంతి రోజున గుమ్మడిపండును దానంగా ఇవ్వడం మరచిపోకూడదు.