ధర్మాత్ములకే భగవంతుడి రక్షణ !

పాండవులు ధర్మాన్ని ఆశ్రయించడం వల్లనే, కృష్ణపరమాత్ముడు వాళ్లను సదా రక్షిస్తూ వచ్చాడు. ధర్మమార్గాన్ని విడవనంతవరకూ భగవంతుడి రక్షణ ఉంటుందని ధర్మరాజుకి తెలుసు కనుకనే, భీముడు ... అర్జునుడు అప్పుడప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించినా ఆయన నచ్చచెబుతూ వచ్చాడు.

కౌరవులు ఎన్ని విధాలుగా కుతంత్రాలు జరిపినా ధర్మరాజు ఎక్కడా తొందరపడినట్టు కనిపించడు. ఆయన కౌరవులలో మార్పునే కోరుకున్నాడుగానీ వాళ్ల పరాభవాన్ని కాదు. అరణ్యవాసంలో వున్న పాండవులు అవమానభారంతో మరింత రగిలిపోవాలనే ఉద్దేశంతో, దుర్యోధనుడు తన పరివారంతో కలిసి అక్కడికి వెళతాడు.

అయితే అనుకోని విధంగా అక్కడ వాళ్లకి 'చిత్రసేనుడు' అనే గంధర్వుడితో గొడవ జరుగుతుంది. చిత్రసేనుడు మాయాయుద్ధంతో దుర్యోధనుడి అనుచరులను ఓడించి ఆయనని బంధిస్తాడు. ఈ విషయం తెలిసి అర్జుడును .. భీముడు ... నకుల సహదేవులు తగినశాస్తి జరిగిందని అనుకుంటారు. ధర్మరాజు మాత్రం జరిగినదానికి ఎంతగానో బాధపడతాడు.

దుర్యోధనుడు దుర్భుద్ధితో వచ్చినా అతను తమ కుటుంబానికి చెందినవాడనే విషయాన్ని మరచిపోకూడదని అంటాడు. తమలో తమకి ఎన్నిగోడవులున్నా ఇతరుల చేతిలో పరాజయానికీ ... పరాభవానికి గురికాకూడదని అంటాడు. శత్రువు బయటవాడైనప్పుడు పాండవులు .. కౌరవులు కలిసి ఎదుర్కోవాలని చెబుతాడు. చిత్రసేనుడి బందీగా వున్న దుర్యోధనుడిని విడిపించుకురమ్మని భీముడితో అంటాడు.

ఆయన ఆదేశం మేరకు భీముడు వెళ్లి చిత్రసేనుడి బందీగా వున్న దుర్యోధనుడికి విముక్తిని కలిగిస్తాడు. ఇలా అడుగడుగునా ధర్మరాజు చూపిన ఓర్పు .. నేర్పు, ఆయన విశ్వసించిన ధర్మము - నీతి పరమాత్ముడి రూపంలో పాండవులకు రక్షణగా నిలిచి విజయాన్ని ప్రసాదించాయి.


More Bhakti News