ఇక్కడి భక్తుల విశ్వాసం ఇదే !

శ్రీకృష్ణుడి లీలావిశేషాలు ఎంతగా చెప్పుకున్నా తనివితీరదు. తనని నమ్ముకున్నవారిని కాపాడటం కోసం ఆయన చూపిన లీలలను తలచుకుని పరవశించిపోనివాళ్లంటూ వుండరు. ఆ స్వామిని కీర్తిస్తూ ... సేవిస్తూ ఆయన ఆరాధనకే తమ జీవితాన్ని అంకితం చేసిన భక్తులు ఎంతోమంది వున్నారు.

అసమానమైన ఆ భక్తులంతా కృష్ణ భక్తితత్త్వాన్ని అర్థంచేసుకుని, అందులోని మాధుర్యాన్ని ఈ ప్రపంచానికి అందించారు. కృష్ణభక్తితో అనేక ప్రాంతాలు ప్రభావితం కావడం వలన, అక్కడ కృష్ణుడి ఆలయాలు నిర్మించబడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో కృష్ణుడు స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు ... మహర్షులు ప్రతిష్ఠించినట్టుగా చెబుతోన్న క్షేత్రాలు ... మహారాజులు ఇలవేల్పుగా భావించి ఆరాధించిన క్షేత్రాలు నేటికీ తమ వైభవాన్ని చాటుకుంటున్నాయి.

అలాంటి విశిష్టమైన క్షేత్రాలలో ఒకటి 'లక్కవరం'లో కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయాన్ని చూడగానే ఇది పురాతనమైనదనే విషయం అర్థమైపోతుంది. గర్భాలయంలో కొలువైన వేణుగోపాలుడిని చూస్తే, ఆయనపై నుంచి దృష్టి మళ్లించుకోవడం కష్టమైపోతుంది. అంతటి మనోహరుడిగా ఆయన కనిపిస్తుంటాడు.

ఆ స్వామి అనుగ్రహం కారణంగానే తమ పాడిపంటలు వృద్ధిచెందుతున్నాయని గ్రామస్తులు విశ్వసిస్తుంటారు. ఆ కృతజ్ఞతతోనే ఆయనకి వివిధరకాల నైవేద్యాలు చేయిస్తుంటారు. ఆయన వైభవానికి సంబంధించి ఎంతమాత్రం లోటు జరగకుండా పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు జరిపిస్తుంటారు. ఆ స్వామి సేవలో ఉత్సాహంగా పాల్గొంటూ తరిస్తుంటారు.


More Bhakti News