లక్ష్మీ కటాక్షాన్ని ఇలా పొందవచ్చు !
జీవితంలో కొన్ని కష్టాలు డబ్బువల్లనే తీరతాయి. కొన్ని సమస్యలు డబ్బువల్లనే పరిష్కారమవుతాయి. కొన్ని ఆపదలు డబ్బువల్లనే గట్టెక్కుతాయి. డబ్బు అనేది బతుకుపట్ల భద్రతను ... భరోసాను కల్పిస్తుంది. ఇతరులకు సాయపడి వారిపట్ల ప్రేమానురాగాలను ప్రదర్శించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే డబ్బు సంపాదనపట్ల అంతా ప్రత్యేకశ్రద్ధను కనబరుస్తుంటారు.
ఎంత కష్టపడితే ఎంతటి సంపాదన లభించాలనేది లక్ష్మీదేవి అనుగ్రహంపైన ఆధారపడి వుంటుంది. సిరిసంపదలను ప్రసాదించే ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడం అంతతేలికైన విషయం కాదు. సత్యధర్మాలను ఆశ్రయించినవారి ఇంట ఉండటానికే లక్ష్మీదేవి ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. ఆమెకి ఇష్టమైన వాటితో పూజాభిషేకాలు జరిపేవారిని అనుగ్రహిస్తుంది. ఈ కారణంగానే అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజున, మరింత భక్తిశ్రద్ధలతో పూజించడం జరుగుతూ వుంటుంది.
అమ్మవారికి పంచామృతాలతో జరిగే అభిషేకాన్ని తిలకించడం వలన, ఆ అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించడం వలన ఆమె అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవికి 'చెరుకురసం'తో చేయబడే అభిషేకం కూడా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. అమ్మవారికి ప్రీతికరమైన చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఆ తల్లి సంతోషిస్తుందనీ, సంతృప్తి చెందుతుందని అంటారు.
చెరుకురసంతో లక్ష్మీదేవిని అభిషేకించడం వలన దారిద్ర్యం నశిస్తుందనీ, దారిద్ర్యం వలన కలిగే దుఃఖం దూరమవుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దారిద్ర్యం ధ్వంసమైపోతుందీ అంటే సిరిసంపదలు చేకూరతాయని అర్థం. అందరికీ కావలసింది లక్ష్మీకటాక్షమే కనుక, ఆ తల్లి మెచ్చే మార్గంలో ప్రయాణంచేస్తూ వుండాలి ... ఆమెకి నచ్చేలా పూజాభిషేకాలు నిర్వహిస్తూ వుండాలి.