భక్తులను తరింపజేసే భగవంతుడు
లోకకల్యాణం కోసం శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలను ధరించాడు. ఆ అవతారాల్లో ఆయన స్వయంభువుగా అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. దేవతల అభ్యర్థన మేరకు ... మహర్షుల కోరిక మేరకు ... భక్తుల ప్రార్ధన మేరకు ఆయన ఆవిర్భవించిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.
అలా దేవతలచే ... మహర్షులచే అర్చామూర్తిగా పూజాభిషేకాలు అందుకున్న స్వామి, ఆ తరువాత కాలంలో వాటికి దూరమైన సందర్భాలు వున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ స్వామి తనపట్ల అసమానమైన భక్తిని కలిగినవారికి స్వప్న దర్శనమిచ్చి, పూర్వవైభవాన్ని పొందిన సంఘటనలు వున్నాయి. అలా వెలుగు చూసిన దైవాలలో 'భద్రాద్రి రాముడు' కూడా కనిపిస్తాడు.
భద్రాచలం సమీపంలో గల 'భద్రిరెడ్డి పాలెం' అనే గ్రామంలో 'పోకల దమ్మక్క' అనే శ్రీరాముడి భక్తురాలు వుండేది. రమ్యమైనటు వంటి రామనామాన్ని స్మరించడం మినహా ఆమెకి మరోధ్యాస వుండేది కాదు. ఆమెకి స్వప్నంలో సాక్షాత్కారమిచ్చిన రాముడు, తన జాడను తెలియజేస్తాడు. తన మూలమూర్తిని వెలికితీసి ఆలయ నిర్మాణానికిగాను గోపన్న సాయం తీసుకోమని చెబుతాడు. సీతారామ లక్ష్మణుల మూలమూర్తుల జాడను తెలుసుకున్న పోకల దమ్మక్క, తాత్కాలికంగా వారికి పందిరి నిర్మిస్తుంది. స్వామి ఆదేశం ప్రకారం గోపన్నను కలుసుకుని విషయం చెబుతుంది.
స్వామివారి మహిమను గురించి తెలుసుకున్న గోపన్న భద్రాచల ఆలయ నిర్మాణానికి పూనుకుని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆగకుండా దానిని పూర్తి చేస్తాడు. భద్రాచల క్షేత్రంలో అడుగుపెట్టిన వాళ్లు స్వామివారిని దర్శించుకుని, ఆయన వైభవానికి కారకులైన పోకల దమ్మక్కను ... రామదాసుగా పిలుచుకునే గోపన్నను స్మరించుకోవడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.