సూర్యభగవానుడిని ఆరాధిస్తే చాలు !

సూర్యభగవానుడి వల్లనే సంవత్సరాలు ... నెలలు ... రోజులు ... పగలు .. రాత్రి ఏర్పడుతున్నాయి. ఆయన అనుగ్రహం వల్లనే సమస్త జీవులకు ఆహారం అందుతోంది ... ఆరోగ్యం కలుగుతోంది. కనిపించే దైవం ఆయనే కనుక అనాదిగా పూజలందుకుంటూ వస్తున్నాడు.

దేవతలు ... గంధర్వులు ... యక్షులు ... నాగులు ... రుషులు ఇలా అంతా ఆ ప్రత్యక్ష నారాయణుడిని ఆరాధిస్తూ వచ్చారు. సూర్యభగవానుడిని పూజించి కోరిన వరాలను పొందినవాళ్లు ఎంతోమంది వున్నారు. వనవాస కాలంలో పాండవులు సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన నుంచి 'అక్షయపాత్ర' ను పొందారు. వనవాస కాలంలో వాళ్లని ఆకలిదప్పులు నుంచి ఈ అక్షయపాత్ర ఎంతగానో కాపాడుతూ వచ్చింది.

అలాగే సత్రాజిత్తు సూర్యభగవానుడిని ప్రార్ధించి, ఆయన నుంచి 'శ్యమంతకమణి' ని వరంగా పొందాడు. ఇక రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరడానికి ముందు సూర్యభగవానుడిని పూజించిన శ్రీరాముడు విజయాన్ని సాధించాడు. ఆ శ్రీరాముడికి తన సహాయ సహకారాలను అందించిన హనుమంతుడు కూడా, సూర్యభగవానుడి నుంచి జ్ఞానసంపదను పొందాడు.

అలాంటి సూర్యభగవానుడికి అనునిత్యం మూడు వేళలలోను అర్ఘ్యం వదలి నమస్కరించడం వలన పాపాలు పటాపంచలై శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది. సంక్రాంతి నుంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే సూర్యభగవానుడిని ఆరాధించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News