లక్ష్మీదేవి కళ నుంచి వచ్చిన చెంచులక్ష్మి
నరసింహస్వామి ఆవిర్భవించిన స్వయంభువు క్షేత్రాల్లో 'చెంచులక్ష్మి' సన్నిధానం కూడా కనిపిస్తూ వుంటుంది. చెంచులక్ష్మి సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో జన్మించిందనీ, అందువల్లనే స్వామివారిని భర్తగా పొందగలిగిందని చెబుతుంటారు. చెంచులక్ష్మిని స్వామివారు మనువాడటానికి దారితీసిన కథనం అత్యంత ఆసక్తికరంగా వినిపిస్తూ వుంటుంది.
సముద్రుడు తన కూతురు లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడికిచ్చి వివాహాన్ని జరిపిస్తాడు. అయితే లోకకల్యాణ కారకమైన ఈ వేడుకకు దూర్వాస మహర్షిని ఆహ్వానించడం మరిచిపోతాడు. అది అవమానంగా భావించిన దూర్వాసుడు, భూలోకంలో చెంచులుగా సంచరించమంటూ శపిస్తాడు. జరిగిన అపరాధం తెలిసిచేసినది కాదని ఆ దంపతులు వేడుకుంటారు.
చెంచులుగా వున్నప్పుడు కూడా లక్ష్మీదేవియే వారి ఇంట కూతురుగా జన్మిస్తుందనీ, శ్రీమన్నారాయణుడే అల్లుడవుతాడనీ .. దాంతో వారి శాపం తొలగిపోతుందంటూ దూర్వాసుడు శాంతిస్తాడు. ఆయన శాపం కూడా లోకకల్యాణ కారకమే అవుతుందని భావించిన సముద్రుడి దంపతులు కృతజ్ఞతలు తెలియజేస్తారు. భూలోకానికి చేరుకున్న ఆ దంపతులు చెంచులుగా జీవిస్తూ వుంటారు.
ఒకానొక సందర్భంలో లక్ష్మీదేవి తన 'కళ' ను ఒక మామిడిపండులో నిక్షిప్తం చేస్తుంది. ఆ మామిడి పండును చెంచు స్త్రీగా వున్న సముద్రుడి భార్య తింటుంది. ఫలితంగా ఆ దంపతులకు 'చెంచులక్ష్మి' జన్మిస్తుంది. ఆ తరువాత హిరణ్యకశిపుడిని సంహరించి, ఆ ఉగ్రత్వంతో తిరుగుతోన్న నరసింహస్వామిని చెంచులక్ష్మి శాంతపరుస్తుంది. అలా స్వామిని సేవిస్తూ ఆయన మనసు గెలుచుకుని వివాహమాడుతుంది.