సంక్రాంతి రోజున శివపూజా ఫలితం

తెలుగువారు జరుపుకునే పెద్దపండుగగా 'మకర సంక్రాంతి' కనిపిస్తుంది. సాధారణంగా ఈ రోజున పితృదేవతల ఆరాధన చేస్తుంటారు. అలాగే పగలంతా ఉపవాస దీక్షను చేపడుతుంటారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన ఈ రోజున సూర్యభగవానుడినీ ... ఆయనే సాక్షాత్తు విష్ణుమూర్తిగా చెప్పబడుతున్నాడు కనుక ఆ శ్రీమన్నారాయణుడినీ .. సిరులనిచ్చే లక్ష్మీదేవిని పూజించడం వలన సకలశుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

రైతులు పడిన కష్టానికి ప్రతిఫలంగా పంటలు ఇంటికి చేరతాయి. ధనధాన్యాలు లక్ష్మీదేవి స్వరూపం కనుక అవి ఇంటికి రావడమంటే, సాక్షాత్తు లక్ష్మీదేవి తమ ఇంటికి రావడమేనని భావిస్తుంటారు. ఈ సందర్భంగా తమ ఇంటికి పంటచేరడానికి కారకుడైన సూర్యభగవానుడితో పాటు, లక్ష్మీనారాయణులను పూజిస్తుంటారు. తొలిపంటతో వివిధరకాల పిండివంటలు తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

ఇక ఇదే రోజున సాయంత్రం (ప్రదోష వేళ) పరమశివుడిని ఆరాధించడం కూడా అనేక శుభాలను అందిస్తుంది. అష్టమూర్తి అయిన ఆదిదేవుడి ఎనిమిది రూపాలలో సూర్యభగవానుడు ఒక రూపంగా చెప్పబడుతున్నాడు. కాబట్టి ఈ రోజున సాయంత్రం సదాశివుడికి 'ఆవునెయ్యి' తో అభిషేకం చేయడం వలన ... ఆయన సన్నిధిలో 'నువ్వుల నూనె'తో దీపం పెట్టడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది. మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యనమస్కారం చేయడం వలన ... లక్ష్మీనారాయణులను పూజించడం వలన, ఆ సాయంత్రం సదాశివుడిని ఆవునెయ్యితో అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News