త్యాగరాజస్వామిని ఆరాధించడమే అదృష్టం
శ్రీరాముడిని కీర్తిస్తూ ... సేవిస్తూ తరించిన మహాభక్తుడు ... వాగ్గేయకారుడు త్యాగరాజు. తాను తరిస్తూ భక్తులను తరింపజేసిన మహానుభావుడాయన. అనునిత్యం ... అనుక్షణం ఆయన శ్రీరాముడిని సేవించడానికే తన జీవితాన్ని ధారపోశాడు. తన పూజామందిరంలోని సీతారాముల ప్రతిమలను సోదరుడే 'కావేరీనది'లో పడేస్తే, ఆ విషయం తెలియని త్యాగరాజు ఆ విగ్రహాల కోసం తపించిపోతాడు. వాటిని వెతుక్కుంటూ అనేక ప్రాంతాలలో అలసటను మరిచిపోయి తిరగడం ఆయన భక్తికి అద్దంపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో త్యాగరాజు బాధచూడలేక ఆ విగ్రహాలు వాటంతట అవే నదిలో నుంచి కొట్టుకువస్తాయి.
ఒకసారి ఆలయంలో గల బావిలో పొరపాటున ఒక వ్యక్తిపడి చనిపోతాడు. అతని భార్యాబిడ్డల బాధను చూడలేకపోయిన త్యాగరాజు ఆ వ్యక్తికి ప్రాణంపోయమని రాముడిని వేడుకుంటాడు. ఆయన విన్నపాన్ని స్వామి మన్నించిన కారణంగా ఆ వ్యక్తి పునర్జీవితుడవుతాడు. ఒకసారి స్వామి దర్శనం కోసం త్యాగరాజు శ్రీరంగం వెళతాడు. ఆ సమయంలో రథోత్సవం జరుగుతూ వుంటుంది. భక్తుల రద్దీ కారణంగా త్యాగరాజు స్వామి దర్శనం చేసుకోలేకపోతాడు. అయితే ఆయన దర్శనం చేసుకునేంత వరకూ ఆ రథం అక్కడి నుంచి ముందుకు కదలకుండా ఉండిపోతుంది.
అలాగే ఒకసారి త్యాగరాజు తిరుమలకు చేరుకునేసరికి పూజాకార్యక్రమాలు ముగించి అర్చకులు గర్భాలయానికి గల తెరవేశారు. స్వామివారిని దర్శించాలనే ఆరాటంతో త్యాగరాజు ''తెర తీయగరాదా ... ''అనే కీర్తనను ఆలపించడంతో, అడ్డుగావున్న ఆ తెర తొలగిపోయిందట. ఇలా అసమానమైన భక్తి శ్రద్ధలతో ... మధురాతి మధురమైన కీర్తనలతో భగవంతుడి మనసును ... ప్రజల హృదయాలను త్యాగరాజు గెలుచుకున్నాడు. ఈ కారణంగానే ఆయన కీర్తనలు ఇప్పటికీ ప్రజల నాల్కలపై నాట్యం చేస్తూనే వున్నాయి.
ఆయన పరమపదించిన 'పుష్యబహుళ పంచమి' రోజున ఆయన 'ఆరాధనోత్సవాలు' జరుపుకుంటూ వుంటారు. త్యాగరాజు జన్మస్థలమైన 'తిరువారూరు' లో ఈ ఆరాధనోత్సవాలు మరింత వైభవాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. త్యాగరాజస్వామిని ఆరాధించడమే ఒక అదృష్టంగా సంగీత సాహిత్య ప్రియులు భావిస్తుంటారు. ఈ ఆరాధనోత్సవాలను తమ ప్రాంతాలలో ఏర్పాటుచేసుకుని త్యాగరాజస్వామి కీర్తనలను ఆలపిస్తూ ... ఆయనని స్మరిస్తూ .. తరిస్తుంటారు.