గొల్లభామ రూపాన్ని ధరించిన లక్ష్మీదేవి

లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సమస్త భోగభాగ్యాలు వుంటాయి. అలాంటి లక్ష్మీదేవితో శ్రీమన్నారాయణుడు సదా సేవించబడుతూ వుంటాడు. ఆయన సేవలో నిత్యం తరిస్తోన్న లక్ష్మీదేవి, స్వామివారి వక్షస్థమును భ్రుగు మహర్షి కాలుతో తాకడాన్ని తట్టుకోలేకపోతుంది.

ఈ విషయంలో స్వామివారు సహనాన్ని పాటించడం నచ్చని లక్ష్మీదేవి కోపంతో దేవలోకాన్ని విడిచి భూలోకానికి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి లేకుండా వైకుంఠమున ఉండలేని నారాయణుడు, ఆమెని వెతుకుతూ భూలోకానికి వెళతాడు. లక్ష్మీదేవి కోసం అనేక ప్రదేశాల్లో వెతికి ఆలసిపోతాడు. ఎంత వెతికినా ఆమె జాడ తెలియకపోవడంతో నిరాశా నిస్పృహలకు లోనవుతాడు.

ఒక పుట్టలో తలదాచుకుని ఆకలితో ... దాహంతో బాధపడసాగాడు. నారాయాణుడు పడుతోన్న అవస్థను గమనించిన నారదమహర్షి ... లక్ష్మీదేవిని కలుసుకుంటాడు. ఆమెని వెతుకుతూ భూలోకానికి వచ్చిన స్వామి ఆకలిదప్పులతో నానాబాధలు పడుతున్నాడని చెబుతాడు. ఆ మాట వినగానే లక్ష్మీదేవి మనసు విలవిలలాడిపోతుంది. తన ప్రాణనాథుడికి కలిగిన కష్టాన్ని గురించి ఆమె బ్రహ్మ .. మహేశ్వరులకు విన్నవిస్తుంది. స్వామిని ఆకలి దప్పుల నుంచి కాపాడమని కోరుతుంది.

లక్ష్మీదేవి కోరిన వెంటనే బ్రహ్మ .. మహేశ్వరులు ఆమె ఎదుట ప్రత్యక్షమవుతారు. స్వామి ఆకలిదప్పులు తీర్చడం కోసం బ్రహ్మదేవుడు గోవు రూపాన్ని ధరించగా, పరమేశ్వరుడు దూడ రూపాన్ని ధరిస్తాడు. దాంతో లక్ష్మీదేవి గొల్లభామ రూపాన్ని ధరించి, ఆ ఆవుదూడలను చోళరాజు గోశాలకు చేరుస్తుంది.

అక్కడి నుంచి ప్రతిరోజు అవి మేతకి వెళుతూ ఉండేవి. ఆ సమయంలోనే స్వామివారు తలదాచుకున్న పుట్ట దగ్గరికి ఆవు వెళ్లి పుట్టలోకి పాలధారలు కురిపించేది. ఆ పాలతో నారాయణుడి ఆకలిదప్పులు తీరుతూ ఉండేవి. ఇలా తన స్వామి ఆకలిదప్పులు తీర్చడం కోసం లక్ష్మీదేవి గొల్లభామ రూపాన్ని ధరిస్తుంది. నారాయణుడిపట్ల చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ భూలోకానికి వచ్చేసినా, ఆయనపట్ల గల అనంతమైన ప్రేమానురాగాలను ఆమె దాచుకోలేకపోతుంది.


More Bhakti News