ఆవేదనని ఆలకించి ఆదుకునే బాబా
తాను సమాధిచెందిన అనంతరం కూడా తన భక్తులను సమాధినుంచే కాపాడుతూ ఉంటానని శిరిడీ సాయిబాబా సెలవిచ్చాడు. ఆనాటి నుంచి బాబా తాను భక్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వస్తున్నాడనే విషయం ఆ భక్తులు పొందుతోన్న అనుభవాలవలన స్పష్టమవుతోంది.
బాబా చల్లనిచూపు వలన ఎంతో మంది భక్తులు అనారోగ్యాల నుంచి ... ఆపదల నుంచి ... ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు. సంతాన సౌభాగ్యాలను ... సంపదలను పొందుతున్నారు. బాబా ఇచ్చిన సందేశం మేరకు భక్తులు మానవత్వాన్ని వీడకుండా దానధర్మాలలో పాల్గొంటూ వస్తున్నారు.
ఇలా భక్తుల హృదయాలను బాబా ప్రభావితం చేయడం వలన అనేక ప్రాంతాలలో ఆయన ఆలయాలు నిర్మితమవుతూ వస్తున్నాయి. అలాంటి బాబా ఆలయాలలో ఒకటి కృష్ణాజిల్లా తిరువూరు - నడింపేటలో దర్శనమిస్తుంది. తిరువూరు పరిధిలో గల విశిష్టమైన ఆలయాలలో ఒకటిగా ఇది వెలుగొందుతోంది. సువిశాలమైన ప్రదేశంలో భారీనిర్మాణంగా కనిపించే ఈ ఆలయం, భక్తులకు బాబాపట్ల గల విశ్వాసానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది.
అందంగా తీర్చిదిద్దబడిన ఇక్కడి ఆలయంలో భక్తులపై బాబా తన కరుణామృత కిరణాలను కురిపిస్తుంటాడు. బాబా సన్నిధికిలోకి అడుగుపెట్టి ఆయనవైపు చూడగానే, వచ్చిన పనేమిటో తనకి తెలుసన్నట్టుగా ఆయన చిరునవ్వును చిందిస్తూ కనిపిస్తుంటాడు. తానుండగా చింతించవలసిన పనిలేదని ధైర్యం చెబుతున్నట్టుగా అనిపిస్తాడు. ఆయనని విశ్వసించి కష్టాల కొలిమిలో నుంచి ... సమస్యల ఊబిలో నుంచి బయటపడినవాళ్లు ఎందరో ఇక్కడ కనిపిస్తుంటారు.
మనసులోని ఆవేదనని బాబాతో చెప్పుకుంటేచాలు, ఆ బరువుని ఆయన వెంటనే తీసేస్తాడని చెబుతుంటారు. అనునిత్యం బాబాకి అభిషేకాలు .. అలంకారాలు ... హారతులు జరుగుతుంటాయి. గురువారాల్లోను ... ఇతర పర్వదినాల్లోను బాబా దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. మనసు బాగోలేనివారు బాబా సన్నిధిలో జరిగే భజనల్లో పాల్గొంటూ వుంటారు. ఆయన అనుగ్రహాన్ని అందుకుని తేలికపడిన మనసుతో తిరిగివెళుతుంటారు.