ఆపదలను తొలగించే అయ్యప్పస్వామి
శబరిమలలో వెలసిన అయ్యప్పస్వామిని దర్శించుకునే భాగ్యం కోసం వివిధ ప్రాంతాలలో ఎంతోమంది భక్తులు మాలధారణ చేస్తుంటారు. దీక్ష తీసుకునే సందర్భంగాను ... పడిపూజలు జరిపేటప్పుడు ... ఇరుముడులు కట్టుకునేటప్పుడు అన్ని ప్రాంతాలలోని ఆలయాలు సందడిగా కనిపిస్తుంటాయి.
ఇక మండలకాలం పాటు ఉదయము ... సాయంత్రము అయ్యప్ప స్వాములు ఆలయాలను దర్శిస్తూ వుంటారు. దాంతో ఆలయాలు భక్తులతో మరింత వైభవాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలా ఈ మాసంలో అయ్యప్ప స్వాముల భజనలతో సందడిగా కనిపించే క్షేత్రాల్లో ఒకటి మిర్యాలగూడ - హనుమాన్ పేటలో దర్శనమిస్తుంది.
సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయానికి అయ్యప్ప దీక్షను చేపట్టిన భక్తులు ఎక్కువగా వస్తుంటారు. అయ్యప్ప దీక్షాకాలం ఆరంభమైన దగ్గర నుంచి దీక్షాకాలం పూర్తయ్యేంత వరకూ ఈ ఆలయంలో ఉచిత అన్నదానం జరుగుతూ వుండటం విశేషం. మకరజ్యోతి దర్శనానికి కూడా పెద్దసంఖ్యలో ఇక్కడి నుంచి భక్తులు బయలుదేరుతుంటారు.
సాధారణమైన రోజుల్లోనూ ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడి స్వామిని పూజించడం వలన ఆపదలు ... అనారోగ్యాలు తొలగిపోతాయని చెబుతుంటారు. అలా స్వామి అనుగ్రహాన్ని పొందినవాళ్లు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా, మండలదీక్షను స్వీకరించి ఆ స్వామిని పూజిస్తుంటారు ... పునీతులవుతుంటారు.