సంక్రాంతిలో భాగంగా కనిపించే రేగుపండ్లు
సంక్రాంతి పండుగకు స్వాగతం చెబుతున్నట్టుగా ఎక్కడ చూసినా 'రేగుపండ్లు' కనిపిస్తుంటాయి. గుండ్రంగాను ... కోలాకారంలోను ... చిన్నవిగాను ... పెద్దవిగాను దర్శనమిస్తూ నోరూరిస్తూ వుంటాయి. ఈ కాలంలో ఈ పండ్లు విరివిగా లభిస్తూ వుంటాయి కనుక ఎక్కువగా తినడం జరుగుతూ వుంటుంది.
సంక్రాంతి పండుగలో రేగుపండ్లు ఒక అంతర్భాగంగా కనిపిస్తుంటాయి. వాకిట్లో ముగ్గువేసి ... ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మల్లో రేగుపండ్లు పెడుతుంటారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనవిగా ... సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైనవిగా చెప్పబడుతోన్న ఈ పండ్లను భోగిపండుగ రోజున ఒక వేడుకగా పిల్లల తలపై నుంచి పోస్తుంటారు. అందువలన వీటిని 'భోగిపండ్లు' గా పిలుస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయనీ ... పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు.
ఇక రేగుపండ్లు తినడం వలన వివిధరకాల వ్యాధులు నియంత్రించబడతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. రేగుపండ్లు తినడం వలన జీర్ణసంబంధమైన ... కంటి సంబంధమైన వ్యాధులు దూరంగా వుంటాయి. వాతం ... పైత్యం ... కఫం తొలగించడమే కాకుండా, క్యాన్సర్ కణాలను సైతం ఇవి నియంత్రిస్తాయని చెప్పబడుతోంది. అయితే ... ఏదైనా మితంగా తింటే ఔషధం ... అతిగా తింటే విషం అనే పెద్దలమాట రేగుపండ్ల విషయంలోనూ వర్తిస్తుందనే విషయాన్ని మరచిపోకూడదు.