భగవంతుడు అలా ప్రసన్నుడవుతాడు
భగవంతుడి నామాన్ని స్మరిస్తూ వుండటం వలన ప్రశాంతత లభిస్తుంది. భగవంతుడి రూపాన్ని ధ్యానిస్తూ వుండటం వలన ఆయన సన్నిధిలో వున్న అనుభూతి కలుగుతుంది. నిరంతరం భగవంతుడి ధ్యాసలో కాలం గడిపేవారి దృష్టిలో దుఃఖానికి విలువే వుండదు. ఎంతటి దుఃఖమైనా వారు ఆ స్వామిని సేవిస్తూ మరిచిపోతూనే వుంటారు.
భగవంతుడి నామాన్ని స్మరించుకునే స్థితిలో లేకపోవడం ... ఆయనని సేవించుకునే అవకాశం లేనప్పుడు మాత్రమే వాళ్లు దుఃఖపడతారు. కొంతమంది భక్తుల జీవితాన్ని పరిశీలిస్తే, వాళ్లు భగవంతుడి సాక్షాత్కారం లభించేవరకూ ఆయన నామస్మరణ విడువకపోవడం కనిపిస్తుంది. గురువు స్థానంలో వున్నవారు తమకి చేసిన మంత్రోపదేశాన్ని అనుక్షణం స్మరిస్తూ వాళ్లు ఆ స్వామి సాక్షాత్కారాన్ని పొందగలిగారు.
వ్యాసరాయలవారిని ఆశ్రయించిన 'కనకదాసు' ... రామానందులవారి నుంచి 'కబీరు దాసు' మంత్రోపదేశాన్ని పొంది, అసమానమైన భక్తిశ్రద్ధలతో ఆ స్వామిని ప్రత్యక్ష దర్శనం చేసుకున్నారు. ఇక క్షేత్రయ్యగా కీర్తిప్రతిష్ఠలు సంపాదించుకున్న వరదయ్య కూడా, ఒకానొక సమయంలో జీవితం పట్ల విరక్తిని పెంచుకుంటాడు.
అలాంటి పరిస్థితుల్లో ఒక సాధువు ఆయనకి వేణుగోపాలుడికి సంబంధించిన మంత్రోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశ మంత్రాన్ని విడువక పఠిస్తూ ఆయన వేణుగోపాలుడిని ప్రసన్నం చేసుకుంటాడు. ఇలా ఎంతోమంది మహానుభావులు భగవంతుడే లోకంగా ... ఆయనే సర్వంగా జీవించారు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ తరించారు.