భక్తుడి ముచ్చట తీర్చిన వరాహ నరసింహుడు
సాధారణంగా కొన్ని క్షేత్రాల్లో వరాహస్వామి ... మరికొన్ని క్షేత్రాల్లో నరసింహస్వామి దర్శనమిస్తూ వుంటారు. ఈ రెండు అవతారాల ఏకరూపంగా స్వామివారు దర్శనమిచ్చే క్షేత్రం ఒకటుంది ... అదే సింహాచలం. విశాఖపట్నానికి సమీపంలోగల కొండపై స్వామి ఇలా ఆవిర్భవించాడు.
జలగర్భంలో గల భూమిని పైకి తీసుకురావడానికి శ్రీమహావిష్ణువు వరాహావతారాన్ని ధరించాడు. ఈ విషయంలో తనకి అడ్డుపడిన హిరణ్యాక్షుడిని స్వామి సంహరించాడు. అలాగే నరసింహస్వామిగా అవతరించి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఈ రెండు అవతారాల ఏకరూపంగా స్వామి సింహాచలంలో పూజలు అందుకుంటూ వుంటాడు. ఇక్కడి స్వామివారి మూర్తి వరాహ ముఖాన్నీ ... మానవ దేహాన్నీ ... సింహపు తోకను కలిగి దర్శనమిస్తూ వుంటాడు.
ఏడాదికి ఒక రోజున మాత్రమే స్వామి ఇలా నిజరూపంలో దర్శనమిస్తాడు. మిగతా రోజుల్లో గంధం పూతతో లింగాకారంలో కనిపిస్తుంటాడు. స్వామి ఇలా రెండు అవతారాల కలయికగా ఆవిర్భవించడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ వుంటుంది. హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి అలా ఉగ్రత్వంతోనే సంచరిస్తూ ఇక్కడి కొండపైకి చేరుకున్నాడట. స్వామిని అనుసరిస్తూ వచ్చిన ప్రహ్లాదుడు ఆయనని స్తుతిస్తూ శాంతింపజేస్తాడు.
నరసింహస్వామి అవతారాన్ని చూసి తరించే భాగ్యం తనకి కలిగిందనీ, అయితే అంతకుపూర్వం స్వామి ధరించిన వరాహ అవతారమూర్తిని కూడా చూడాలని వుందని ప్రహ్లాదుడు అంటాడు. భక్తుడి ముచ్చటతీర్చడం కోసం స్వామివారు వరాహ అవతారాన్ని ధరించి చూపుతాడు. ఆ రూపానికి భక్తిశ్రద్ధలతో నమస్కరించిన ప్రహ్లాదుడు, వరాహ నారసింహుడిగా అక్కడ కొలువై తన పూజలు అందుకోవలసిందిగా కోరతాడు.
భక్తుడి అభ్యర్థనను మన్నించిన స్వామి అలాగే వరాహ నారసింహుల ఏకమూర్తిగా ఆవిర్భవించాడని చెబుతారు. అలా భక్తుడి కోసం ఆవిర్భవించిన స్వామి భక్తజన రక్షకుడిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తులచే ప్రేమగా సింహాద్రి అప్పన్నగా పిలిపించుకుంటూ అనుగ్రహిస్తున్నాడు. భక్తుడి కోరిక తీర్చడం కోసం వెలిసిన స్వామి కనుక, ఆయన భక్తుల వెన్నంటి ఉంటాడని అంటారు. అడుగడుగునా అనేక విశేషాలను ఆవిష్కరించే ఈ మహిమాన్విత క్షేత్రానికి వచ్చినవారు, ఆ స్వామి అనుగ్రహాన్ని పొందకుండా తిరిగివెళ్లరని చెబుతుంటారు.