శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన భోగి

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజులలో 'భోగి' ఒకటిగా చెప్పబడుతోంది. గోదా సమేతుడైన స్వామివారిని ఈ రోజున పూజించడం వలన సకలశుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రంగనాయకస్వామి పట్ల గోదాదేవి మధురభక్తిని ఆవిష్కరిస్తుంది. ఆ స్వామినే తన భర్తగా భావించి అనుక్షణం ఆయనని సేవిస్తుంది.

సుగంధభరితమైన తాజా పూలతో అందంగా మాలలు కట్టి, ముందుగా తాను ధరించి అ వెంటనే వాటిని స్వామివారికి సమర్పిస్తూ వుండేది. మనసునిండా ఆ స్వామిపట్ల ప్రేమానురాగాలను నింపుకున్న ఆమె ఆ స్వామిని కీర్తిస్తూ ముఫ్ఫై 'పాశురాలు' రచిస్తుంది. అసమానమైన భక్తిశ్రద్ధలతో ఆ స్వామి మనసు గెలుచుకుంటుంది.

గోదాదేవి సాక్షాత్తు అమ్మవారి అంశతో అవతరించినదని తెలుసుకున్న విష్ణుచిత్తుడు, స్వామి ఆదేశానుసారం ఆమెని ఆయనకిచ్చి వివాహాన్ని జరిపిస్తాడు. అలా రంగనాయకస్వామితో గోదాదేవి వివాహం జరిగింది 'భోగి' రోజునేయని చెప్పబడుతోంది. సాక్షాత్తు అమ్మవారు రంగనాయకస్వామి సన్నిధికి చేరుకొని భోగములందుకున్న రోజు కనుకనే ఈ రోజుకి 'భోగి' అనే పేరు వచ్చిందని కూడా అంటారు.

ఆండాళ్ గా పిలవబడుతోన్న గోదాదేవిని పరిణయమాడిన రోజుగా కూడా ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. ఈ రోజున గోదా సమేత రంగనాయకస్వామి ఆలయాన్ని దర్శించడం వలన ... పూజించడం వలన సకలశుభాలు చేకూరతాయి. కన్నె పిల్లలు ఈ రోజున గోదా సమేత రంగనాయకస్వామిని ఆరాధించడం వలన మనసుకి నచ్చినవారితో వివాహం జరుగుతుందని స్పష్టం చేయడం జరుగుతోంది.


More Bhakti News