లక్ష్మీదేవి ఇక్కడ ఉండేందుకు ఇష్టపడుతుంది

దారిద్ర్యమనేది జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అది ఆనందాన్ని అందనంత దూరంచేసి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆత్మాభిమానాన్ని తీవ్రంగా గాయపరుస్తూ అవమానాలపాలు చేస్తుంటుంది. కోరికలు నెరవేరకుండా చేస్తూ నిరాశా నిస్పృహలకు గురిచేస్తుంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే, ఆర్ధిక పరిస్థితి మెరుగుపడవలసి వుంటుంది.

ఆర్ధిక స్థితి మెరుగుపడాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండవలసి వుంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సంపదలు వుంటాయి. ఎక్కడైతే సిరులు కురుస్తూ ఉంటాయో అక్కడ సంతోషాలు వెల్లివిరుస్తుంటాయి. అలా సిరిసంపదలతో ... సంతోషాలతో ఏ ఇల్లయినా కళకళలాడుతూ వుండాలంటే ఆ కుటుంబసభ్యులంతా పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తూ వుండాలి.

గుమ్మానికి తోరణంగా వున్న ఎండిపోయిన మామిడాకులు ఎప్పటికప్పుడు తీసేసి కొత్తగా తోరణం కడుతూ వుండాలి. గుమ్మానికి ముందు పాదరక్షలు విడవకుండా చూసుకోవాలి. గుమ్మం వైపు కాళ్లుచాపి కూర్చోవడంగానీ ... పడుకోవడంగాని చేయకుండా వుండాలి. ఒకరిపై ఒకరు కసుర్లు ... విసుర్లు ప్రదర్శించకుండా ప్రశాంతత పాటించాలి. పూజా మందిరంతో పాటు ఇంటిమొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.

ఉదయాన్నే కుటుంబ సభ్యులంతా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరంలో దీపారాధన చేసి .. పూజాభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించాలి. ఇంట్లో దైవ సంబంధమైన చిత్రపటాలు కనిపిస్తూ వుండాలి ... దేవుడి గురించిన మంచి మాటలు వినిపిస్తూ వుండాలి.

ఇలా బద్ధకం ... సోమరితనమనేది లేకుండా అంతా చైతన్యవంతులుగా ఉంటూ, భగవంతుడిని ఆర్చిస్తూ ఆరాధిస్తూ వున్న ఇంట్లో ఉండటానికి లక్ష్మీదేవి ఆసక్తి చూపుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఎవరికివాళ్లు తమ ఇల్లు ప్రశాంతతకు ... పవిత్రతకు నిలయంగా ఉండేలా చూసుకుంటూ వుండాలి. ధర్మబద్ధమైన జీవితానికీ ... దైవారాధనకు ప్రాధాన్యతనిస్తూ లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ వుండాలి.


More Bhakti News