రాయలవారికి గల నమ్మకం అలాంటిది !

శ్రీకృష్ణదేవరాయలవారి పేరు వినగానే అలనాటి విజయనగర వైభవం కనులముందు కదలాడుతుంది. అష్టదిగ్గజాలతో ఆయన నడిపిన 'భువన విజయం' గుర్తుకు వస్తుంది. సంగీత సాహిత్యాది కళలను ఆయన ఆదరించి ప్రోత్సాహించిన తీరు ప్రశంసనీయమనిపిస్తుంది.

రాయలవారు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి వినయశీలి. అలాంటి శ్రీకృష్ణదేవరాయలవారికి మంత్రిగా 'తిమ్మరుసు' వ్యవహరిస్తూ ఉండేవాడు. రాయలవారి చిన్నతనం నుంచి ఆయనని తిమ్మరుసు ఎరుగుదురు. రాయలవారిచే ప్రేమాభిమానాలతో 'అప్పాజీ' అని పిలిపించుకునే తిమ్మరుసు, అవసరమైతే రాయలవారిని మందలించే స్థాయిలో ఉండేవాడు.

పరిపాలనా సంబంధమైన విషయాల్లో రాయలవారు ఆయన సూచనలను తు చ తప్పక పాటిస్తూ ఉండేవాడు. అలాంటి రాయలవారి వివాహం తిమ్మరుసు ప్రమేయం లేకుండానే 'చిన్నమదేవి' తో జరిగిపోతుంది. ఆ సంఘటన వలన తిమ్మరుసు మనసుకి కష్టం కలుగుతుంది. ఆయనని శాంతింపజేయడానికి రాయలవారు ప్రయత్నిస్తాడు.

తమకి రాజకీయ పరమైన అండదండలు అవసరమనీ, అందుకోసం ఆయన వివాహాన్ని శ్రీరంగపట్టణాధీశుని కుమార్తె 'తిరుమలాదేవి'తో జరిపించాలని అనుకున్నానని తిమ్మరుసు తన మనసులోని మాటను చెబుతాడు. తన మాటని మన్నించి ఆయన తిరుమలదేవిని వివాహం చేసుకోక తప్పదని అంటాడు. తిమ్మరుసు ఏ నిర్ణయం తీసుకున్నా దానివెనుక తన క్షేమం ... విజయనగర సంక్షేమం ఉంటాయని విశ్వసించిన రాయలవారు అందుకు అంగీకరిస్తాడు.

తిమ్మరుసు అభ్యర్థన మేరకు తిరుమలదేవిని కూడా రాయలవారు వివాహం చేసుకుంటాడు. చిన్నమదేవి - తిరుమలదేవితో కలిసి రాయలవారు ఎన్నో క్షేత్రాలను దర్శించాడు. ఆ క్షేత్రాల అభివృద్ధికిగాను తనవంతు కృషిచేశాడు. అందుకే కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్లినప్పుడు అక్కడ ఆయన పేరు వినిపిస్తుంది ... ఆనాటి వైభవం కనిపిస్తుంది.


More Bhakti News