దోషాలను నివారించే దివ్యక్షేత్రం
లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాల్లో 'శాపల్లి' ఒకటిగా కనిపిస్తుంది. ప్రాచీనకాలంనాటి ఈ దివ్యక్షేత్రం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం పరిధిలో వెలుగొందుతోంది. శాపల్లి గ్రామంలో గల చిన్నకొండపై స్వామివారు కొలువై భక్తులకు దర్శనమిస్తూ వుంటాడు.
ఈ కొండ 'కమలం' ఆకృతిని పోలివుండటం వలన దీనిని 'కమలాద్రి' గా పిలుస్తుంటారు. ఇక్కడి లక్ష్మీనరసింహుడిని కమలాద్రి లక్ష్మీనరసింహుడుగా కొలుస్తుంటారు. స్వామివారిని దర్శించి పూజించడం వలన వివిధరకాల దోషాలు నివారించబడతాయని చెప్పబడుతోంది. స్వామివారు ఈ కొండపై కొలువు దీరడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ వుంటుంది.
హరిత మహర్షి కాశీ క్షేత్రాన్ని దర్శించి తిరిగివస్తుండగా, ఆయనకి లక్ష్మీనరసింహస్వామి ప్రతిమ లభిస్తుంది. అలా స్వామి కనిపించడం వెనుక ఆయన సందేశమేదో వుందని భావించిన మహర్షి, దానిని తలపై పెట్టుకుని బయలుదేరుతాడు. ఆయన ఈ కొండ సమీపానికి రాగానే అనుకోకుండా అడుగులు కొండవైపు పడ్డాయట.
అలా ఆయన కొండపైకి చేరుకుంటూ ఉండగానే విగ్రహం బరువు పెరిగిపోతూ ఉండటంతో దానిని కిందకి దించివేశాడట. అప్పుడు స్వామి ప్రత్యక్ష దర్శనమిచ్చి తనని అక్కడే ప్రతిష్ఠించి పూజించమని సెలవిచ్చాడట. కొండపైగల కోనేరు స్వామివారి కైంకర్యాలకి గాను హరిత మహర్షి ఏర్పాటు చేసిందని చెబుతారు. ఈ కోనేరులో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని పూజించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయనీ, ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు చేకూరతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.