విశేష ఫలితాలనిచ్చే శివలింగార్చన !

ఆదిదేవుడి అనుగ్రహాన్ని కోరుతూ దేవతలు వివిధ ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి పూజిస్తూ వచ్చారు. అలాగే మహర్షులు ఆ స్వామిని తమ తపోశక్తితో సాక్షాత్కరింపజేసుకుని ఆయన అక్కడే ఆవిర్భవించేలా చేశారు. ఇక కొంతమంది భక్తుల అభ్యర్థనను మన్నించి మహాదేవుడు ఆయా ప్రదేశాల్లో కొలువుదీరాడు. ఆ ప్రదేశాలన్నీ కూడా పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.

ఆయా పుణ్యక్షేత్రాలకి వెళ్లిన భక్తులు అక్కడి నుంచి చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని తమవెంట తెచ్చుకుని పూజామందిరంలో వుంచి అనునిత్యం పూజాభిషేకాలు జరుపుతుంటారు. మరికొంతమంది బంగారు .. వెండి ... ఇత్తడి వంటి లోహాల సంబంధమైన శివలింగాలను అర్చిస్తుంటారు. కొన్ని పదార్థాలతో తయారుచేయబడిన శివలింగాన్ని ఆరాధించడం వలన కూడా విశిష్టమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఒక్కో పదార్థంతో తయారుచేయబడిన శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం చేకూరుతుందని చెప్పబడుతోంది. ఆరోగ్యం ... ఐశ్వరం ... విజయం ... ఇలా ఆశించిన ఫలితాలను పొందాలనుకునేవాళ్లు అందుకు సంబంధించిన శివలింగాన్ని అర్చిస్తుంటారు. ఇక జీవితంలో ఎవరైనా కోరుకునేది సుఖశాంతులే. ఆశించినవి లభించినప్పుడు సహజంగానే సుఖశాంతులు చేరువవుతుంటాయి.

అలాంటి సుఖశాంతుల కోసం ఏ పదార్థంతో తయారుచేసిన శివలింగాన్ని ఆరాధించాలనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. 'పంచదార పాకం' తో తయారుచేయబడిన శివలింగాన్ని పూజించడం వలన ఆశించిన సుఖశాంతులు లభిస్తాయని చెప్పబడుతోంది. కనుక జీవితంలోని ఒడిదుడుకులు ఎదుర్కుంటోన్న వాళ్లు, పంచదార పాకంతో తయారుచేసిన శివలింగాన్ని పూజించడం వలన ఆ స్వామి అనుగ్రహంతో సుఖశాంతులు చేరువవుతాయి.


More Bhakti News