ముక్తిని ప్రసాదించే ఈశ్వరుడు

పరమశివుడు తన భక్తుల మధ్య ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. తనకి చల్లదనాన్ని ఇస్తూ ఉపశమనాన్ని ప్రసాదించే కైలాసపర్వతంపై కన్నా, తన కరుణను కోరుకునే భక్తుల మధ్య కొలువుదీరడానికే ఆయన ఎక్కువ మొగ్గు చూపుతుంటాడు.

తన సేవకు మనసును అంకితం చేస్తే చాలు, ఆ స్వామి మురిసిపోతాడు ... మైమరచిపోతాడు. అడిగిన వరాలను ఆనందంగా అనుగ్రహిస్తాడు. అందువల్లనే ఆ స్వామిని సేవించుకునే భాగ్యం కోసం భక్తులు ఆరాటపడుతుంటారు. అలా భక్తులచే అపారమైన విశ్వాసాన్ని చూరగొన్న సదాశివుడి క్షేత్రం ... ముక్తేశ్వర క్షేత్రంగా ప్రకాశం జిల్లాలో అలరారుతోంది.

మహిమాన్వితమైనదిగా చెప్పుకునే ఈ క్షేత్రం పౌరాణిక నేపథ్యాన్నీ ... చారిత్రక వైభవాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. సాక్షాత్తు పరశురాముడు ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. తండ్రి ఆదేశం మేరకు తల్లి శిరస్సును ఖండించిన పరశురాముడు తీవ్రమైన మనోవేదనకి లోనవుతాడు. అనుక్షణం తనని వెంటాడుతోన్న ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికిగాను ఆయన శివలింగ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకుగాను అత్యంత పవిత్రమైన తపోభూమిని అన్వేషిస్తూ ఆయన ఈ ప్రదేశానికి చేరుకుంటాడు.

ఇక్కడి స్థలమహాత్మ్యాన్ని గుర్తించి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఇక్కడి స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తూ పాపం నుంచి విముక్తిని పొందినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి ముక్తేశ్వర క్షేత్రమనే పేరు వచ్చిందని అంటారు. ఇక్కడి మహాదేవుడు మహిమాన్వితుడు అనడానికి అనేక విశేషాలు కనిపిస్తూ వుంటాయి. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన పాపాలు పటాపంచలైపోతాయనీ, ముక్తేశ్వరుడి అనుగ్రహం కారణంగా ముక్తి లభిస్తుందని అంటారు.


More Bhakti News