ఆలోచనతోనే శత్రువును జయించాలి

అరణ్యవాస కాలం ముగియడంతో పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఞాతంగా ఉంటూ వుంటారు. ఆ సమయంలో వాళ్లని ఎవరు పసిగాట్టినా తిరిగి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వుంటుంది. అందువలన వాళ్లు తమ వేషధారణలు ... నామధేయాలు మార్చుకుని మసలుకుంటూ వుంటారు. తమ శౌర్యపరాక్రమాలు కూడా బహిర్గతం కాకుండా జాగ్రత్తపడుతూ ఎంతో సహనంతో కాలాన్ని వెళ్లదీస్తుంటారు.

విరాటరాజు భార్య దగ్గర 'సైరంధ్రి' పేరుతో దాసీగా ద్రౌపది వుంటుంది. విరాటరాజు భార్యకి సోదరుడైన కీచకుడు ... సైరంధ్రిపై మనసు పారేసుకుంటాడు. అవకాశం దొరికితేచాలు ఆమెను వేధిస్తూ ఉండసాగాడు. ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన ద్రౌపది, విరాటరాజు సమక్షంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. ఆ కొలువులోనే పనిచేస్తోన్న ధర్మరాజు మరొకరికి అవకాశం ఇవ్వకుండా ఈ విషయంలో కల్పించుకుంటాడు.

అక్కడి వారి దృష్టిలో ద్రౌపదిని మందలిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఆమెకి నచ్చచెబుతాడు. ఆవేశం వలన వున్న సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్య పుట్టుకొస్తుందంటూ, తాము ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ తలదాచుకున్నది గుర్తుచేస్తాడు. ఆవేశపడటం వలన మరింత అల్లరిపాలు కావలసివస్తుందనీ, సహనాన్ని సాధనచేస్తూ ఆలోచన అనే ఆయుధంతోనే సమస్యను పరిష్కరించుకోవాలని అంటాడు.

ఆవేశం కన్నా ఆలోచన బలమైనదనీ, దానితోనే శత్రువుపై విజయం సాధించాలనే అర్థంవచ్చేలా మాట్లాడతాడు. ఆ మాటలోని అర్థాన్ని గ్రహించిన ద్రౌపది శాంతాన్ని పొందుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తరువాత అంతాకలిసి ఆలోచించుకుని ఎవరికీ ఎలాంటి అనుమానం కలగకుండా ఒక పథకం ప్రకారం కీచకుడిని మట్టుబెడతారు.


More Bhakti News