శక్తిమంతమైన ఈ క్షేత్రంలో అడుగుపెడితే చాలు
నరసింహస్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల్లో 'మట్టపల్లి' ఒకటిగా కనిపిస్తుంది. కృష్ణానదీ తీరంలో వెలసిన అత్యంత విశిష్టమైన దివ్యక్షేత్రాల జాబితాలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా మఠంపల్లి మండలంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి నరసింహుడు ప్రహ్లాదుడిని అక్కున చేర్చుకుని భక్తులను అనుగ్రహిస్తుంటాడు.
'గుహ' నే గర్భాలయంగా చేసుకుని స్వామివారు కొలువైన తీరు భక్తులకు ఆశ్చర్యాన్నీ ... అనుభూతిని అందిస్తుంది. ఈ గుహలో స్వామివారి సన్నిధిలో కూర్చుని 'భరధ్వాజ మహర్షి' చాలాకాలం పాటు ఆరాధించినట్టు స్థలపురాణం చెబుతోంది. స్వామివారు వెలుగులోకి వచ్చినప్పుడు గుహకి ఒక ద్వారం మాత్రమే వుండేదట. దాని ద్వారానే భక్తులు లోపలికి వెళ్లి వచ్చేవారు. ఆ తరువాత కాలంలో లోపలికి వెళ్లిన భక్తులు బయటికి రావడానికి మరో ద్వారం ఏర్పరచడం జరిగింది.
గుహలో ఒకవైపున ఒక రంధ్రం కనిపిస్తూ వుంటుంది. తేజో రూపంలో మహర్షులు రాత్రివేళలో ఈ రంధ్రం గుండా గుహలోకి ప్రవేశించి స్వామివారిని అర్చిస్తారని చెబుతారు. దేవతలు ... మహర్షులచే మాత్రమే పూజాభిషేకాలు అందుకుంటూ వచ్చిన స్వామి, ఇక భక్తజనకోటికి తన దర్శన భాగ్యాన్ని కల్పించాలనే సంకల్పంతో వెలుగులోకి రావడం వలన ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెబుతుంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన వెంటనే గ్రహపీడల నుంచి ... దుష్టశక్తుల వలన కలిగే బాధల నుంచి విముక్తి కలుగుతుందని అంటారు.
తాను ప్రకటనమవడానికి స్వామివారు ఒక 'గరుడ పక్షి'ని తన భక్తుడికి సంకేతంగా చూపించడం జరిగిందని అంటారు. అందువలన ఈ క్షేత్రాన్ని గగనతలంలో తిరుగాడుతూ గరుత్మంతుడు పర్యవేక్షిస్తూ ఉంటాడని చెబుతుంటారు. ఇక హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇలా హనుమంతుడు ... గరుత్మంతుడు స్వామివారి సేవలో తరించే మహిమాన్వితమైన క్షేత్రంగా మట్టపల్లిని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా ఈ క్షేత్రంలో అడుగడుగునా అనేక విశేషాలు కనిపిస్తుంటాయి. స్వామివారి లీలావిశేషాలుగా అవి ఆనందాన్ని కలిగిస్తుంటాయి ... ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి.