కాళికాదేవిగా కదిలివచ్చిన అమ్మవారు
లోకకల్యాణం కోసం ఆదిపరాశక్తి అనేక రూపాలను ధరిస్తూ వచ్చింది. అమ్మవారు ప్రశాంతమైన వదనంతో చిరునవ్వులు చిందిస్తూ ... అభయ వరద హస్తాలతో కొలువుదీరి వుంటే, భక్తులు నయనానందకరంగా దర్శించుకుంటూ వుంటారు. ఇక ఆ తల్లి కాళికాదేవిగా కొలువై వుంటే చూడటానికే కొంతమంది సంశయిస్తుంటారు.
నల్లని మేని రంగుతో ... చెదిరిన జుట్టుతో ... వెన్నులో వణుకు పుట్టించే చూపులతో ... రక్తం అంటిన ఎర్రని నాలుకను బయటికి సాచి అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. జగన్మాతగా చెప్పబడుతోన్న అమ్మవారు ఎందుకు ఇంతటి భయంకరమైన రూపాన్ని ధరించిందనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. కాళికాదేవి రూపాన్ని అమ్మవారు ధరించడం వెనుక కూడా లోకకళ్యాణమే కనిపిస్తుంది.
'రక్తబీజుడు' అనే రాక్షసుడు వరబలగర్వంతో దేవతలను ... సాధుసజ్జనులను వేధిస్తుంటాడు. వాళ్ల అభ్యర్థన మేరకు ఆ రాక్షసుడిని సంహరించడానికి కుమారస్వామి రంగంలోకి దిగుతాడు. అయితే ఆ రాక్షసుడి శరీరం నుంచి కిందపడిన ఒక్కో రక్తపు చుక్క నుంచి మరో రక్తబీజుడు పుట్టుకొస్తుంటాడు. దాంతో అసహనానికి లోనైన కుమారస్వామి తన తల్లిని ప్రార్ధిస్తాడు.
అప్పుడు పార్వతీదేవి ... కాళికాదేవి రూపాన్ని ధరిస్తుంది. కుమారస్వామి రక్తబీజుడిని సంహరిస్తూ వుండగా, ఆ అసురుడి శరీరం నుంచి చిందిన రక్తం నేలపై పడకుండా తన నాలుకను చాపలా పరుస్తుంది. దాంతో కుమారస్వామితో ఒంటరిగా పోరాడలేకపోయిన రక్తబీజుడు యుద్ధరంగంలో కుప్పకూలిపోతాడు. అలా లోకకల్యాణం కోసం అమ్మవారు అంతటి భయానకమైన రూపాన్ని ధరించినా, ఆ రూపం వెనుక కన్నతల్లి వంటి ఆమె చల్లని మనసు భక్తులను ఆదరిస్తూనే వుంటుంది ... అనుగ్రహిస్తూనే వుంటుంది.