దుష్టులను దూరంగా ఉంచడమే ఉత్తమం
కొంతమంది తాము మాత్రమే సుఖశాంతులతో వుండాలని కోరుకుంటూ వుంటారు. ఇతరులు ఇబ్బందులుపడుతూ వుండటం చూసి సంతోషిస్తారు. అవకాశం దొరికితే చాలు అవతలివారి ఆనందానికి అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు. అవతలివారిని బలహీనులను చేయడం కోసం వారిమధ్య విభేదాలను సృష్టిస్తారు. అవసరాన్నిబట్టి ... అవకాశాన్నిబట్టి వ్యవహరిస్తుంటారు.
అయితే ఉత్తములైనవాళ్లు ఇలాంటివారిని దగ్గరికి రానీయరు. స్వభావం రీత్యా స్వార్థపరులైన వాళ్లు సాయం చేస్తామని వస్తే విశ్వసించక వాళ్లని దూరం పెడుతుంటారు. స్వార్థపరుల దగ్గరికి సాయానికి వెళ్లడం ఎంతటి అమాయకత్వమో, తమంతట తాముగా వాళ్లు సాయం చేస్తామని వచ్చినప్పుడు నమ్మడం కూడా అంతే అమాయకత్వమని విశ్వసిస్తుంటారు. అలాంటివాళ్లలో పాండవ మధ్యముడైన 'అర్జునుడు' ఒకడుగా కనిపిస్తాడు.
గంధర్వ రాజైన గయుడు విషయంలో కృష్ణార్జునుల మధ్య మాటపట్టింపు యుద్ధం వరకూ వెళుతుంది. ఇదే అదనుగా భావించిన దుర్యోధనుడు ... అర్జునుడి వైపు చేరి అతణ్ణి రెచ్చగొట్టి కృష్ణుడికి మరింత దూరం చేయాలని చూస్తాడు. కృష్ణార్జునులు ఒంటరివారైపోతే, వాళ్లని జయించడం మరింత తేలికవుతుందని భావిస్తాడు. అర్జునుడు కోరకపోయినా వెళ్లి, కృష్ణుడితో అతను చేయనున్న యుద్ధానికి తమ సాయం వుంటుందని ప్రకటిస్తాడు.
దుర్యోధనుడి స్వార్థబుద్ధి గురించి తెలిసిన అర్జునుడు సున్నితంగా తిరస్కరిస్తాడు. స్వార్థపరులు జోక్యం చేసుకుంటే సమస్య తీవ్రత మరింత పెరుగుతుందని గ్రహించిన ఆయన, తాను ఎవరి సహాయ సహకారాలను తీసుకోదలచుకోలేదని చెబుతాడు. ఇది కేవలం తనకీ కృష్ణుడికి మాత్రమే సంబంధించిన విషయమనీ, ఇందులో మరొకరి ప్రమేయం అవసరం లేదని అంటాడు. తన పథకం విఫలమైనందుకు కంగుతిన్న దుర్యోధనుడు, నిరాశా నిస్పృహలతో వెనుదిరుగుతాడు. ఉత్తముడైన అర్జునుడు తీసుకున్న ఆ నిర్ణయమే కృష్ణుడితో ఆయన అనుబంధం కొనసాగడానికి కారణమవుతుంది.