నర్మదా నదిని దర్శిస్తే చాలట !
గంగ ... యమున ... గోదావరి ... సరస్వతి ... కావేరి ... సింధు ... నర్మద పుణ్యనదులుగా ప్రవహిస్తూ అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తుంటాయి. అత్యంత పవిత్రమైనవిగా చెప్పబడుతోన్న ఈ నదులు అనేక పుణ్యక్షేత్రాలను స్పర్శిస్తూ, తమని స్పర్శించిన భక్తులను పునీతులను చేస్తుంటాయి. స్పర్శ మాత్రం చేతనే పాపాలను పటాపంచలు చేసే ఈ ఏడు నదులు ఒక్కొక్కటి ఒక్కో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి.
వీటిలో నర్మదా నది మరింత ప్రత్యేకతను కలిగినదిగా చెబుతుంటారు. పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ వుండగా ఆయన శరీరం నుంచి జాలువారిన స్వేద బిందువుల నుంచి నర్మదా నది పుట్టినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శివుడి స్వేదం నుంచి ఆవిర్భవించినది కనుకనే, ఈ నదిలో లభించే రాళ్లు సహజసిద్ధంగా శివలింగాకారంలో కనిపిస్తూ ఉంటాయని అంటారు. ఈ నదిలో లభించే శివలింగాన్ని పూజించడం వలన కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయని చెబుతుంటారు.
నర్మదా నది అనేక క్షేత్రాలను ... తీర్థాలను స్పర్శిస్తూ ప్రవహిస్తూ వుంటుంది. నర్మదా నదీతీరంలో చేసే జపతపాలు అనతికాలంలోనే అనంతమైన ఫలితాలను అందిస్తాయనీ, అందువలన ఇది మహిమాన్వితమైనదని చెప్పబడుతోంది. ఈ కారణంగానే ఒకప్పుడు ఈ నదీతీరంలో ఎంతోమంది మహర్షులు తపస్సు చేస్తూ వుండేవారట. సాధారణంగా నదులలో స్నానం చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తూ వుంటాయి. ఇక నర్మదా నదిని దర్శించడం వల్లనే అందులో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.