ఆరుద్ర నక్షత్రాన శివపూజా ఫలితం !
భక్తులు తలచినా ... పిలిచినా వున్నపళంగా వాళ్లని చేరుకొని అనుగ్రహించే దైవంగా ఆదిదేవుడు కనిపిస్తుంటాడు. కొండకోనల్లోను ... గుహల్లోనూ ... గర్భాలయాల్లోను ఇలా స్వామి ఎక్కడ కొలువుదీరినా, దోసెడు నీళ్లతో అభిషేకించి బిల్వదళాలు సమర్పిస్తేచాలు కొండంత వరాలను ప్రసాదిస్తూ వుంటాడు.
ఇక విశేషమైన రోజుల్లో స్వామివారిని ఇలా పూజించడం వలన ఆయన చూపే అనుగ్రహం కూడా అశేషంగానే వుంటుంది. అలాంటి విశేషమైన రోజుల్లో ఒకటిగా పుష్యమాసంలో వచ్చే 'ఆరుద్ర నక్షత్రం' కనిపిస్తుంది. ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి జరిపే ప్రత్యేక ఉత్సవమే 'ఆరుద్రోత్సవం' గా చెప్పబడుతోంది.
ఈ రోజున శివాలయాలన్నీ భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. ఆరుద్ర నక్షత్రం పరమశివుడి జన్మనక్షత్రంగా ... ప్రీతికరమైన నక్షత్రంగా ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. ఈ పర్వదినాన శివాలయాలో ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ రోజు సాయంత్రం (ప్రదోష వేళ)లో జరిపే పూజాభిషేకాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి.
అందువలన భక్తులు ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, ప్రదోష వేళలో ఆయనకి బిల్వపత్రాలతో పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో పూజా మందిరంలోగానీ, శివాలయంలోగాని దీపం వెలిగించడం మంచిది. ఇలా ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున పరమశివుడిని పూజించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి సకలశుభాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.