ఆపదలను తొలగించే దైవదర్శనం
సమస్త పాపాలను పటాపంచలు చేయగలిగి ... ఆపదల నుంచి బయటపడేయగలిగే శక్తిమంతమైన మంత్రమేదని పార్వతీదేవి అడిగినప్పుడు, 'రామ' అనే రెండు అక్షరాలకు అంతటి శక్తి వుందని పరమేశ్వరుడు సెలవిచ్చినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది.
రామ అనే రెండు అక్షరాలను పలకడానికి ఎంతటి తేలికగా ఉంటాయో, వినడానికి అంత మధురంగా వుంటాయి. రామా అంటూ చేసే నామస్మరణ ఎంతటి వేగంగా ఆ స్వామి హృదయాన్ని చేరుతుందో, అంతటి వేగంగా ఆయన అనుగ్రహం లభిస్తుంది. అందుకే ప్రతి గ్రామంలోను రామాలయం కనిపిస్తుంటుంది. ప్రతి మంటపంలోను ఆయన నామసంకీర్తన వినిపిస్తూ వుంటుంది.
అలా నిత్యం రామనామ సంకీర్తనతో పరవశింపజేసే క్షేత్రంగా 'చింతకుంట' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఈ గ్రామంలో 'శ్రీ సీతారామచంద్రస్వామి' వారి ఆలయం దర్శనమిస్తుంది. వందల సంవత్సరాల చరిత్రను కలిగిన ఇక్కడి సీతారామలక్ష్మణులను చూసితీరవలసిందే. విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతూ వుంటుంది. ఆపదలు ఎదురైనప్పుడు ఇక్కడి రాముడిని తలచుకుంటేచాలు, వాటి నుంచి వెంటనే బయటపడటం జరుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.
తమని కాపాడుతూ వుండే సీతారాముల వైభవానికి ఎలాంటి లోటురాకుండా భక్తులు చూసుకుంటూ వుంటారు. అంతా కలిసి ఆలయ జీర్ణోద్ధారణ గావించడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సీతారాముల కల్యాణోత్సవం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతూ వుంటుంది. ప్రత్యేక పూజలు ... విశేషమైన సేవలు కనువిందు చేస్తుంటాయి. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. సీతారాములను దర్శించుకుని కట్నకానుకలు చదివించుకుని వెళుతుంటారు.