అదే వేదాద్రి నరసింహస్వామి ప్రత్యేకత !

లోకకల్యాణం కోసమే శ్రీమన్నారాయణుడు నరసింహస్వామిగా అవతరించాడు. కొన్ని ప్రదేశాల్లో నరసింహస్వామి స్వయంభువుగా ఆవిర్భవిస్తూ వచ్చాడు. లోకకల్యాణ కారకుడైన స్వామిపట్ల కృతజ్ఞతతో ఆయా ప్రదేశాల్లో దేవతలు ఆయన ప్రతిమను ప్రతిష్ఠించి పూజించారు. ఆ ప్రదేశాలు కాలక్రమంలో పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.

ఇక లోకకల్యాణాన్ని ఆశించే మహర్షులు ఆ స్వామి అనుగ్రహాన్ని కోరుతూ వివిధ ప్రదేశాల్లో ఆయన మూర్తులను ప్రతిష్ఠించారు. ఆపదల నుంచి ... అనారోగ్యాలనుంచి తమని బయటపడేయమని చెప్పుకోవడానికిగాను సాధారణ మానవులు సైతం ఆ స్వామి మూర్తిని ప్రతిష్ఠింపజేసుకుని ఆరాధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో స్వామివారు కొలువుదీరిన విధానాన్నిబట్టి ఆయా క్షేత్రాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి.

అయితే స్వామి స్వయంభువుగాను ... దేవతల కారణంగాను ... మహర్షుల వలన ... సాధారణ మానవుల వలన వివిధ నామాలతో కొలువైన దివ్యక్షేత్రం ఒకటుంది ... అదే 'వేదాద్రి'. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో ... కృష్ణా తీరంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ 'జ్వాలా నరసింహస్వామి' స్వయంభువుగా చెప్పబడుతున్నాడు. ఇక సాలగ్రామ నరసింహస్వామిని బ్రహ్మదేవుడు ... వీర నరసింహస్వామిని గరుత్మంతుడు ... యోగ నరసింహస్వామిని ఋష్యశృంగుడు ... లక్ష్మీనరసింహస్వామిని సాధారణ మానవులు ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది.

నరసింహస్వామి స్వయంభువుగా ఆవిర్భవించడమే కాకుండా, దేవతలు ... మహర్షులు ... సాధారణ మానవులచే ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకుంటూ వుండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు. పంచ నారసింహులు కొలువైన ఈ క్షేత్రం మహా శక్తిమంతమైనదనీ ... మహిమాన్వితమైనదని అంటారు.


More Bhakti News