వ్యాధులను నివారించే సూర్యారాధన

సృష్టిలోని సమస్త జీవులను సూర్యభగవానుడు ప్రభావితం చేస్తుంటాడు. జీవరాసులు ఆయనపై ఆధారపడే తమ మనుగడను కొనసాగిస్తుంటాయి. సూర్యుడితో తమ జీవితం ముడిపడివుందని గ్రహించిన మానవుడు, అనాదిగా ఆయనని భగవంతుడిగా భావిస్తూ ... పూజిస్తూ వస్తున్నాడు.

మహర్షులు సైతం ఆయనని ప్రత్యక్ష నారాయణుడిగా భావిస్తూ ఆరాధించారు. సూర్యనమస్కారం వలన కలిగే ఉత్తమ ఫలితాలను ఈ లోకానికి చాటిచెప్పారు. సూర్యభగవానుడి పూజలో సంపెంగలు ... పున్నాగలు ... పొగడలు ... గన్నేరులు ... జాజులు ... నాగకేసరాలు విశేషమైనవిగా సెలవిచ్చారు.

సూర్యభగవానుడికి ప్రీతికరమైన ఈ పూలతో ఆయనని పూజించడం వలన, అనారోగ్య సమస్యలు ... దారిద్ర్య బాధలు దూరమవుతాయని చెప్పబడుతోంది. ఆనందకరమైన జీవితాన్ని అనారోగ్యాలు అతలాకుతలం చేస్తుంటాయి. అనారోగ్యమనేది కష్టపడే శక్తిని హరించివేయడమే కాకుండా, అప్పటివరకూ సంపాదించినది కూడా హారతి కర్పూరం చేస్తుంది. దాంతో దారిద్ర్యాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది.

అనారోగ్యం శరీరం సహకరించకుండా చేయడం వలన ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. జీవితంలో అత్యంత దుర్భరమైనది ఇతరులపై ఆధారపడటమే. అనునిత్యం సూర్యనమస్కారం చేస్తుండటం వలన, సూర్యభగవానుడి పూజలో ఆయనకి ప్రీతికరమైన పూలను ఉపయోగించడం వలన అనారోగ్యాలు ... దానివలన కలిగే దారిద్ర్యం ... దుఃఖం దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News