నరసింహస్వామి ఆరాధనా ఫలితం !

హిరణ్యకశిపుడి వలన ప్రహ్లాదుడికి కలుగుతోన్న కష్టాల నుంచి విముక్తిని కలిగించడం కోసం, లోకకంటకుడైన హిరణ్యకశిపుడి బారి నుంచి సాధు సజ్జనులను రక్షించడం కోసం శ్రీమహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించాడు. అసురసంహారం అనంతరం ఆ ఉగ్రరూపంలోనే స్వామి అనేక ప్రాంతాలలో తిరుగాడుతూ కొండగుహలలో ఆవిర్భవించాడు.

ఈ కారణంగానే స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించిన ఎక్కువ క్షేత్రాలు గుట్టలపైనా ... గుహల్లోనూ కనిపిస్తుంటాయి. స్వామివారి ఆవేశం లోకకంటకులపైన ... ఆయన చల్లని అనుగ్రహం భక్తులపైన వుంటుంది. అందువల్లనే అపారమైన విశ్వాసంతో భక్తులు ఆయన ఆలయంలోకి అడుగుపెడుతుంటారు. తమ బాధలను ... ఆవేదనలను స్వామివారి చెవిన వేస్తుంటారు.

నరసింహస్వామిని పూజించడం వలన దుష్టశక్తుల వలన కలిగే బాధలు దూరమైపోతాయి. గ్రహ సంబంధమైన దోషాల వలన పడుతోన్న ఇబ్బందులు తొలగిపోతాయి. తనని ఆరాధించేవారికి స్వామి ధైర్యాన్ని వరంగా ప్రసాదిస్తాడట. ధైర్యమనేది ఒక తెగింపుతో అడుగుముందుకు వేసేలా చేస్తుంది. సంశయమనేది లేకుండా ధైర్యంతో చేసే పనులు సఫలీకృతమవుతాయని చెప్పబడుతోంది.

అందువలన నరసింహస్వామిని పూజించడం వలన ఎవరి రంగాల్లో వాళ్లకి కార్యసిద్ధి కూడా కలుగుతుందనేది స్పష్టం చేయబడుతోంది. లోకకల్యాణ కారకుడైన నరసింహస్వామిని పూజించడం వలన గ్రహపీడలు ... దుష్టప్రయోగాలు నశిస్తాయి. అడుగుముందుకు వేయడానికి అవసరమైన ధైర్యం, దాని వెనుకే విజయం ... సంపద ... సంతోషం ఒక్కొక్కటిగా చేరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News