జ్యోతి గణపతి దర్శనఫలితం !
దేవతలకు గణాధిపతిగా వెలుగొందుతున్నా వినాయకుడిలో వినయమే కనిపిస్తుంది. ఆడుతూ పాడుతూ పిల్లలు ఆరాధించినా, ఆనందంతో ఆశీస్సులు అందజేయడంలో వినాయకుడి తరువాతనే ఎవరైనా అనిపిస్తుంది. సాధారణ మానవుల మొదలు మహర్షులచే ... దేవతలచే కూడా ఆయన నిత్యపూజలు ... తొలిపూజలు అందుకుంటూ వుంటాడు.
అలాంటి వినాయకుడు వివిధ ముద్రలతో ... నామాలతో అనేక క్షేత్రాలలో దర్శనమిస్తూ వుంటాడు. ఒక్కోముద్రను కలిగిన వినాయకుడు ఒక్కో విశిష్టతను సంతరించుకుని, ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంటాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందుకే ఆయా మనోభీష్టాలను బట్టి ఆయా ముద్రలను కలిగిన వినాయకుడిని పూజిస్తూ వుండటం మనకి కనిపిస్తూ వుంటుంది.
ఈ నేపథ్యంలో 'జ్యోతి గణపతి' గా స్వామి పూజాభిషేకాలు అందుకునే క్షేత్రం, జిల్లా కేంద్రమైన 'నెల్లూరు' లో విలసిల్లుతోంది. భక్తులకుగల ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చడానికి తాను సిద్ధంగా వున్నానన్నట్టుగా ఇక్కడ వివిధ ముద్రలతో .. నామాలతో వినాయకుడు దర్శనమిస్తూ వుంటాడు. గర్భాలయ మూలమూర్తిగా స్వామివారు 'అఖండ జ్యోతి' వెలుగులో భక్తులకు దర్శనమిస్తూ వుంటాడు. ఈ కారణంగానే స్వామిని 'జ్యోతి గణపతి' గా కొలుస్తుంటారు.
జ్యోతి అనేది వెలుగురేఖలను ప్రసరింపజేస్తూ చీకట్లను తరిమేస్తుంది. అలాగే ఇక్కడి స్వామివారిని దర్శించడం వలన అజ్ఞానమనే చీకట్లు తొలగిపోతాయని చెబుతుంటారు. జ్ఞానమనే వెలుగే జీవితానికి సరైనమార్గాన్ని సూచిస్తుంది. జ్ఞానం సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది ... మంచి ఆలోచనలు విజయాలను సంపాదించి పెడతాయి. విజయం వెంట సంపదలు పలకరిస్తూ వస్తాయి ... సంతోషాలను ప్రసాదిస్తాయి. ఇలా జీవితం ఆనందంగా సాగిపోవడానికి అవసరమైనవి అనుగ్రహించే ఇక్కడి జ్యోతి గణపతి మహిమాన్వితుడనీ ... ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని చెబుతుంటారు.