ధర్మబద్ధమైన జీవితమే విజయాలనిస్తుంది

అత్రిమహర్షి మహా తపోబల సంపన్నుడు .. ఆయన అర్థాంగి అనసూయ మహా పతివ్రత. లోకానికే ఆదర్శప్రాయమైన దంపతులుగా వాళ్లు కొనియాడబడ్డారు. అలాంటి కీర్తిప్రతిష్ఠలను ఆ దంపతులు కలిగి ఉండటాన్ని భరించేలేకపోయిన 'సదానందుడు' అనే దుర్మార్గుడు వాళ్ల ఆశ్రమాన్ని తగులబెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఫలితంగా చూపును కోల్పోయి, ఆ దంపతులను శరణువేడతాడు.

ఇక వశిష్ఠ మహర్షి సత్యధర్మాలను నిలబెట్టడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినవాడు. ఆయన భార్య అరుంధతి నారీ లోకానికే ఆదర్శమూర్తిగా నిలిచింది. వశిష్ఠ మహర్షి దంపతులను ఇబ్బందిపెట్టడం కోసం దేవేంద్రుడు కరవుకాటకాలను సృష్టిస్తాడు. ఆశ్రమవాసంలోని విద్యార్థులంతా ఆకలితో అలమటిస్తూ వుంటారు. అలాంటి పరిస్థితుల్లో అరుంధతి తన పాతివ్రత్య మహిమతో 'కామధేనువు' ను వరంగా పొందుతుంది. తమని ఆశ్రయించినవారికి ఆకలిబాధ అనేది తెలియకుండా చేస్తుంది.

ఇక చ్యవన మహర్షి - సుకన్య కూడా లోకానికి ఆదర్శ దాంపత్యాన్ని చూపినవారే. మంచితనంతో అశ్వనీదేవతలకు ఆశ్రయం కల్పించినందుకు వాళ్లు దేవేంద్రుడి ఆగ్రహానికి గురవుతారు. లోక కల్యాణం కోసం వాళ్లు తలపెట్టిన యాగానికి దేవేంద్రుడు అనేక విఘాతాలు కల్పిస్తాడు. ఒక వైపున చ్యవన మహర్షి తన తపోబలంతోను ... మరోవైపున సుకన్య తన పాతివ్రత్య మహిమతోను దేవేంద్రుడిని ఎదుర్కుని విజయం సాధిస్తారు.

ఇలా భగవంతుడిని ఆరాధిస్తూ ... ఆశ్రయిస్తూ సత్యధర్మాలను కలిగివున్నవారు, దేవతలను ఎదిరించిన సందర్భాలు ఎన్నో కనిపిస్తుంటాయి. భగవంతుడి సేవలో తరిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించినవారే విజయాలను సాధించగలరనే విషయాన్ని నిరూపిస్తూ వుంటాయి.


More Bhakti News