ఇక్కడి హనుమంతుడిని విశ్వసిస్తే చాలు
భగవంతుడుని విశ్వసిస్తేచాలు కష్టాలు కనుమరుగైపోతాయి ... కన్నీళ్లు దూరమైపోతాయి. భగవంతుడిని నమ్ముకుని బాధలుపడినవాళ్లు లేరు. అందుకు నిదర్శనంగా పురాణాల్లోను ... ఇతిహాసాలలోను అనేక సంఘటనలు కనిపిస్తాయి. భగవంతుడిపట్ల భక్తికలిగి ఉండటానికీ ... ఆయన సేవలో పాలుపంచుకోవాలనే ఆరాటం కలగడానికి పూర్వజన్మ సుకృతం వుండాలి.
అలా జన్మజన్మల బంధం కలిగినవారిని ఆయన మరింత త్వరగా అనుగ్రహిస్తుంటాడు ... తనసేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తుంటాడు. అలాంటి భగవంతుడు ఒక్కోసారి అర్చామూర్తిగా భక్తుల నిరాదరణకి గురవుతుంటాడు. అప్పుడు ఆయన తన పట్ల అంకితభావం కలిగిన భక్తులను ఎంచుకుని వాళ్ల ద్వారా పూర్వ వైభవాన్ని పొందుతుంటాడు.
అలా శిధిలావస్థ నుంచి పూర్వవైభవాన్ని పొందిన దైవంగా 'రావులపెంట' కి చెందిన హనుమంతుడు కనిపిస్తాడు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలో గల ఈ క్షేత్రంలో ప్రాచీనకాలానికి చెందిన 'వీరాంజనేయుడు' దర్శనమిస్తూ వుంటాడు. ప్రాచీనకాలానికి చెందిన ఇక్కడి హనుమంతుడు నిరాదరణకి గురికాగా, స్వామివారు ఒక భక్తురాలికి స్వప్నంలో కనిపించి ఆలయ జీర్ణోద్ధారణ గావించి తనకి నిత్యసేవాలు జరిగేలా చూడమని చెప్పాడట.
అక్కడి అర్చకుడికి ఈ విషయాన్ని తెలిపిన ఆమె, ఆయన సహకారంతో స్వామివారి ఆదేశాన్ని పూర్తిచేసింది. ఆనాటి నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక్కడి హనుమంతుడికి పదకొండు ప్రదక్షిణలు చేసి ... సిందూర అభిషేకం చేయించి ... వడమాలను నైవేద్యంగా సమర్పిస్తేచాలు, మనసులోని కోరికలు అనతికాలంలోనే తీరిపోతాయని చెబుతుంటారు. స్వామి దర్శనం భాగ్యం వలన తలపెట్టినకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయనీ, సమస్యలన్నీ తొలగిపోయి సకలశుభాలు కలుగుతాయని అంటారు.