ముక్కోటి రోజున దర్శించవలసిన క్షేత్రం

పుష్యశుద్ధి ఏకాదశి రోజున శ్రీదేవి - భూదేవి సమేతంగా శ్రీమహావిష్ణువు వైకుంఠ ప్రవేశం చేస్తాడు. ఆ సమయంలో స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు అక్కడ వేచివుంటారు. అందువలన దీనిని వైకుంఠ ఏకాదశిగా ... ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు. ఈ రోజంతా కూడా ఉపవాసదీక్షను చేపట్టి జాగరణకు సిద్ధపడి స్వామివారిని సేవిస్తూ తరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ రోజున సూర్యోదయానికిముందే స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడానికి భక్తులు ఆలయాల్లో బారులు కడుతుంటారు. ఈ నేపథ్యంలో ముక్కోటి ఏకాదశి రోజున దర్శించుకోవలసిన క్షేత్రాలలో విశిష్టమైనదిగా 'ర్యాలి' దర్శనమిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. పురాణపరమైన నేపథ్యాన్నీ ... చారిత్రక వైభవాన్ని కలిగివున్న ఈ క్షేత్రంలో 'శ్రీ జగన్మోహినీ కేశవస్వామి' కొలువుదీరి కనిపిస్తుంటాడు.

ఒకే సాలగ్రామశిలకు ఒకవైపున కేశవస్వామి ... మరోవైపున జగన్మోహిని రూపం గల ఈ మూలమూర్తి స్వయంభువు అని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి స్వయంభువు సాలగ్రామ శిల ఈ ప్రపంచంలో మరెక్కడాలేదని చెబుతారు. అసురులకు అమృతం అందకుండా చేయడం కోసం శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపాన్ని ధరిస్తాడు. ఆ సౌందర్యానికి ఆకర్షితుడైన పరమశివుడు ఆతృతగా జగన్మోహినిని అనుసరిస్తాడు. అలా జగన్మోహిని రూపంలో వడివడిగా ఈ ప్రదేశానికి చేరుకున్న శ్రీమహావిష్ణువు నిజరూపాన్ని పొంది సదాశివుడికి తన లీలావిశేషాన్ని తెలియజేశాడని స్థలపురాణం చెబుతోంది.

శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపంలో అసురులకు అమృతం అందకుండా చేస్తాడు. భస్మాసురుడి బారి నుంచి శివుడిని కాపాడతాడు. మోహినీ రూపంతో పరమశివుడిని ఆకర్షితుడిని చేయడం వలన, వాళ్ల తేజస్సు నుంచి 'మణికంఠుడు' జన్మిస్తాడు. అలా మణికంఠుడు జన్మించినది కూడా అసురసంహారం కోసమే. ఇలా లోకకల్యాణం కోసం శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపాన్ని ధరించాడు. ఆ లీలావిశేషాన్ని ఆవిష్కరించే ఈ క్షేత్రాన్ని ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున దర్శించడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది ... అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుంది.


More Bhakti News