డబ్బు కన్నా ప్రేమాభిమానాలే మిన్న !
డబ్బు అవసరాలను తీరుస్తుందనేది ఎంత నిజమో ... ఆప్యాయతానురాగాలను పంచేవాళ్లను దూరం చేస్తుందనేది అంతనిజం. కొంతమంది డబ్బేలోకం ... డబ్బే సర్వం అన్నట్టుగా బతుకుతుంటారు. వాళ్లు డబ్బుగురించే ఆలోచిస్తారు ... డబ్బు గురించే మాట్లాడతారు. డబ్బులేనివాళ్లను పలకరించడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతారు.
అన్ని అవసరాలను తీర్చగల శక్తి ... ఆపదల నుంచి గట్టెక్కించగల శక్తి డబ్బుకి వుందని అనుకుంటూ వుంటారు. ఎవరైనా మంచిమనసుతో పలకరించినా ... పెద్ద మనసుతో గౌరవించినా, అదంతా తమ డబ్బుచూసేనని అనుకుంటారు. తాము గొప్పవాళ్లమనే భావనతో మంచి మనుషులకు దూరమైపోతారు. అయితే ఏదో ఒక సంఘటన అలాంటివాళ్ల కళ్లు తెరిపిస్తుంది.
డబ్బు అవసరాలను తీరుస్తుందిగానీ, ఆప్యాయతను పంచలేదనే విషయం వాళ్లకి అర్థమవుతుంది. డబ్బు ఒంటరి తనమనేది తెలియకుండా చేస్తుందేమోగానీ, ఓదార్పునివ్వలేదని స్పష్టమవుతుంది. డబ్బు ఆనందాన్నిస్తే .. ఆప్యాయత అనుభూతిని అందిస్తుందని తెలుస్తుంది. డబ్బుతో కొనగలిగినవన్నీ కొంటూ వెళ్లిపోవచ్చు. ఆ డబ్బుతో కొనలేనిది అవసరమైనప్పుడు తోటి మనిషి విలువ తెలుస్తుంది.
డబ్బుంది కదా అని అందరినీ దూరం చేసుకుంటే, అది లేని రోజున ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది. డబ్బుకన్నా ప్రేమాభిమానాలే మిన్న అన్నట్టుగా మసలుకోవడం వలన అందరి ఆదరణ లభిస్తుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా బలమైన సైన్యం తనతో ఉందనే ధైర్యం ముందుకు నడిపిస్తుంది.