ఎలాంటివారికి దైవం దారి చూపుతుంది ?

సత్యధర్మాలను ఆశ్రయించినవారినీ ... సదా భగవంతుడిని సేవిస్తూ వుండేవారిని ... పతిసేవయే పరమాత్ముడి సేవగా భావించేవారిని ... ఇతరులకు మేలు చేయడమేతప్ప కీడుచేయడం తెలియనివాళ్లని ఆ దైవం సదా కాపాడుతూనే వుంటుంది. వాళ్ల వెన్నంటి ఉంటూ సరైన మార్గాన్ని చూపుతూనే వుంటుంది. అందుకు నిదర్శనంగా 'దమయంతి' జీవితం కనిపిస్తుంది.

కలిపురుషుడి ప్రభావం వలన జూదంలో రాజ్యాన్ని కోల్పోయిన నలమహారాజు అడవుల పాలవుతాడు. పతివ్రతా ధర్మాన్ని అనుసరిస్తూ దమయంతి ఆయన వెంటనడుస్తుంది. తనతో పాటు ఆమె కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో, అడవిలో అర్థరాత్రివేళ ఆమెని వదిలి నలుడు వెళ్లిపోతాడు. అమ్మవారి అనుగ్రహంతో ఆ అడవి నుంచి బయటపడిన దమయంతి 'ఛేది' రాజ్యానికి చేరుకుంటుంది.

అక్కడి మహారాణి దృష్టిలోపడి ఆమె ఆశ్రయాన్ని పొందుతుంది. దమయంతి నుదుటి మధ్యలో గల 'పుట్టుమచ్చ'ను చూసి ఆమెను గుర్తించిన సుదేవుడు అనే బ్రాహ్మణుడు, ఆమె ఎవరనేది మహారాణికి చెబుతాడు. దమయంతి తమకి దగ్గర బంధువనే విషయం ఆ సమయంలోనే మహారాణికి తెలుస్తుంది. అడవిలో దారీ తెన్నూ తెలియక అష్టకష్టాలుపడుతోన్న తనని నేరుగా బంధువుల ఇంటికి చేర్చిన అమ్మవారికి మనసులోనే దమయంతి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. సత్యధర్మాలను ఆశ్రయించినవారికి దైవమెప్పుడూ దారి చూపుతూనే ఉంటుందని సుదేవుడు అంటాడు.

మహారాణి నుంచి సెలవు తీసుకున్న దమయంతి, పుట్టింటికి చేరుకొని తన బిడ్డలను చూసుకుని మురిసిపోతుంది. పుట్టింటిలో సమస్త భోగాలు వున్నా, భర్త పంచే ప్రేమానురాగాల ముందు అవి సాటిరావని దమయంతి భావిస్తుంది. తన భర్త ఆచూకీని తెలుసుకుని ఆయనని రప్పిస్తుంది. బిడ్డలతోనూ ... భర్తతోను ఆనందకరమైన జీవితాన్ని పొందుతుంది. అలా నలుడిని కలిపురుషుడు ఆవహించిన కారణంగా ఏర్పడిన సమస్యలు, దమయంతి వైపు నుంచి దైవానుగ్రహంతో చక్కబడుతూ వస్తాయి.


More Bhakti News