ముక్కోటి ఏకాదశిన ఏ పారాయణ చేయాలి ?

శ్రీదేవి - భూదేవి సమేతుడైన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగివస్తాడు. ఆ సమయంలో ముక్కోటి దేవతలు వైకుంఠం ఉత్తరద్వారన నిలిచి స్వామి దర్శనం చేసుకుని సేవిస్తారు. యోగనిద్ర నుంచి మేల్కొన్న స్వామివారు తిరిగి ఈ ఏకాదశి రోజున వైకుంఠ ప్రవేశం చేసి తన దర్శనభాగ్యాన్ని కల్పించడం వలన దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు.

ఈ రోజున సూర్యోదయానికి ముందే భక్తులు వైష్ణవ సంబంధమైన ఆలయాలకివెళ్లి ఉత్తరద్వారం గుండా ఆయనని దర్శించుకుంటూ వుంటారు. శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ ఏకాదశి రోజున ఆయన నామాన్ని స్మరిస్తూ ... రూపాన్ని ధ్యానిస్తూ గడపవలసి వుంటుంది. లోకకల్యాణం కోసం ఆ స్వామి ధరించిన అవతారాలను గుర్తుచేసుకోవడం వలన ... ఆ అవతారాల్లో ఆయన ఆవిష్కరించిన లీలావిశేషాలను తలచుకోవడం వలన అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.

ఈ రోజున పూజామందిరంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి .. అష్టోత్తర శతనామావళి చెప్పుకోవాలి. అలాగే ఆ స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. ఇక కాస్తంత ఓపిక చేసుకుని అయినా ఈ రోజున 'విష్ణు పురాణం' పారాయణ చేయడం మంచిది. ఈ రోజున విష్ణుపురాణం పారాయణ చేయడం వలన మనసు ఆ భగవంతుడి సన్నిధిలోనే వుంటుంది. ఆయన లీలావిశేషాల వలన కలిగిన అనుభూతితో తరిస్తుంది. ఉపవాస దీక్షను చేపట్టి విష్ణుపురాణం పారాయణ చేస్తూ జాగరణ చేయడం వలన ఉత్తమగతులు కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News