అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చే గణపతి !
అయ్యప్పస్వామి దీక్షను చేపట్టిన భక్తులు శబరిమల వెళ్లి ఆ స్వామి దర్శనం చేసుకుని వస్తుంటారు. స్వామి మాలను ధరించడం ... ఆయనని దర్శించడం వలన సకలశుభాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు. దీక్షధారణ జరినప్పటి నుంచి అనేక నియమాలను పాటిస్తూ, నిరంతరం ఆ స్వామి నామసంకీర్తన చేస్తూ మానసికంగా ఆయనకి మరింత చేరువవుతారు.
దీక్షాకాలంలో ఒక్కోరోజు గడుస్తున్నాకొద్దీ, శబరిమల యాత్రకి అవసరమైన శక్తి వాళ్లకి లభిస్తూ వుంటుంది. అలా ఇరుముడితో శబరిమల యాత్రకి బయలుదేరిన స్వాములు, అడవీమార్గంలో కొండలను దాటుతూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. స్వామివారే తమ వెన్నంటి వుండి తమని ముందుకునడిపిస్తూ ఉంటాడని వాళ్లు విశ్వసిస్తుంటారు. అలా 'పంబానది'కి చేరుకున్న అయ్యప్పలు అక్కడ స్నానం చేస్తారు. అక్కడి నుంచి కదిలిన భక్తులకు 'గణపతి సన్నిధానం' కనిపిస్తుంది.
అయ్యప్ప స్వాములు తప్పనిసరిగా ఇక్కడి గణపతి దర్శనం చేసుకుని ఆయనకి కొబ్బరికాయ కొడతారు. అక్కడి వరకూ ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూసిన తాను, ఇక ముందు కూడా వాళ్ల వెన్నంటి వుంటూ స్వామి సన్నిధానానికి చేరుస్తానని చెబుతున్నట్టుగా ఇక్కడి గణపతి దర్శనమిస్తూ ఉంటాడని అంటారు. భక్తిశ్రద్ధలతో గణపతిని దర్శించుకున్న స్వాములు, అక్కడి నుంచి మరింత ఉత్సాహంతో ... ఉత్తేజంతో ముందుకు కదులుతారు.