శ్రీరంగనాథుడి మహిమ అలాంటిది !
శ్రీరంగం .. అనే పేరు వినగానే రంగనాథస్వామి దివ్యమంగళ రూపం కనులముందు కదలాడుతుంది. తమిళనాడు ప్రాంతంలోని ఈ ఆధ్యాత్మిక కేంద్రంలోకి అడుగుపెడితే సాక్షాత్తు వైకుంఠంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ఏడు ప్రాకారాలు ... పదిహేను గోపురాలు ... అద్భుతంగా తీర్చిదిద్దిన మంటపాలు ఇవన్నీ కూడా రంగనాథుడి వైభవాన్ని అందంగా ... అద్భుతంగా ఆవిష్కరిస్తుంటాయి.
రంగనాథస్వామి విగ్రహాన్ని 'విభీషణుడు' లంకకు తీసుకుని వెళ్తుండగా, ఆ స్వామి అంతకుముందు ఒక భక్తుడికి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడే కొలువుదీరాడని స్థలపురాణం చెబుతోంది. రంగనాథస్వామి మూలమూర్తిని శ్రీమహావిష్ణువు నుంచి వరంగా పొందిన బ్రహ్మదేవుడు, ఇక్ష్వాకు మహారాజు తపస్సుకు మెచ్చి ఆయనకి ఇస్తాడు. ఆ తరువాత కాలంలో శ్రీరాముడు ఈ రంగనాథస్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవాడట.
శ్రీరాముడితో కలిగిన అనుబంధం కారణంగా, ఆయన దివ్యమంగళ రూపాన్ని అనునిత్యం దర్శించుకోకుండా ఉండలేనని విభీషణుడు అంటాడు. తనపట్ల విభీషణుడికి గల ప్రేమాభిమానాలను అర్థం చేసుకున్న రాముడు, తనకి బదులుగా ఆ రంగనాథస్వామిని ఆరాధించమంటూ ఆ విగ్రహాన్ని ఇచ్చి పంపుతాడు. అలా లంకానగరానికి బయల్దేరిన ఆయన కావేరీ నదీ ప్రాంతానికి చేరుకోగానే, లోకకల్యాణం కోసం రంగనాథస్వామి ఇక్కడ కొలువుదీరతాడు. స్వామివారిని లంకానగరానికి తీసుకువెళ్లి నిత్యం పూజించుకోవాలనే తన కోరిక నెరవేరకుండా పోయిందనే బాధతో విభీషణుడు కన్నీళ్లపర్యంతమవుతాడు.
దాంతో రంగనాథస్వామి ప్రత్యక్షమై బాధపడవలసిన పనిలేదనీ, తనని రాత్రి వేళలో దర్శించుకుని సేవించుకునే వరాన్ని అనుగ్రహిస్తున్నానని చెబుతాడు. అలా విభీషణుడిని అనుగ్రహించిన స్వామి ఆ తరువాత కూడా ఎంతోమంది భక్తులకు తన దర్శనభాగ్యాన్ని కల్పించడం ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని చాటుతోంది. నూటాఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ప్రధానమైనదిగా కనిపించే ఈ మహిమాన్విత క్షేత్రాన్ని 'ముక్కోటి ఏకాదశి' రోజున దర్శించడం వలన ఉత్తమగతులు లభిస్తాయని చెప్పబడుతోంది.