ఇక్కడి హనుమకు ప్రదక్షిణలు చేస్తే చాలట !
సీతారాములు కొలువైనచోట హనుమంతుడు తప్పక దర్శనమిస్తుంటాడు. సీతారాములతో గర్భాలయంలోనే కాకుండా, గర్భాలయానికి ఎదురుగాగల ప్రత్యేక మదిరంలో సైతం ఆయన కనిపిస్తుంటాడు. ఇక కొన్ని క్షేత్రాల్లో ప్రధానదైవంగా ఆయన అలరారుతుంటాడు. శ్రీరాముడిని పూజించేవారిని ... తనని సేవించేవారిని ఆయన సదా కాపాడుతూ వుంటాడు.
కొంతమంది మహాభక్తుల చరిత్రలను పరిశీలిస్తే, తనని విశ్వసించినవారిని హనుమంతుడు అనుక్షణం ఎలా రక్షిస్తూ ఉంటాడనేది అర్థమవుతుంది. హనుమంతుడి ప్రతిమగానీ ... చిత్రపటం గాని చాలా ఇళ్లలో కనిపిస్తూ వుంటాయి. దానిని బట్టి ఆయనపట్ల వాళ్లకి గల నమ్మకం ఎంతటిదో తెలుస్తుంది.
అలా భక్తులచే బలమైన విశ్వాసాన్ని చూరగొన్న హనుమంతుడు మనకి 'కంపాలపల్లి' లో దర్శనమిస్తుంటాడు. ఈ గ్రామం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పరిధిలోకి వస్తుంది. విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలో 'భక్తాంజనేయస్వామి' కొలువుదీరి వుంటాడు. ప్రాచీనకాలం నుంచి స్వామి ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటున్నాడని చెబుతుంటారు.
ఇక్కడి హనుమంతుడు ప్రదక్షిణలతోనే ప్రీతిచెందుతాడని అంటారు. అందువలన భక్తులు స్వామివారికి తమ మనసులోని కోరికను చెప్పుకుని, ముందుగా అనుకున్న ప్రకారం ప్రదక్షిణలు చేస్తుంటారు. అలా అనునిత్యంగానీ ... మంగళవారాల్లోగాని ప్రదక్షిణ చేసినవారి మనోభీష్టాలు తప్పక నెరవేరతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.
స్వామి అనుగ్రహం లభించాక ఆయనకి సిందూరంతో అభిషేకం ... ఆకుపూజ చేయిస్తుంటారు. స్వామి కరుణా కటాక్షాల వలన శారీరక .. మానసిక పరమైన అనారోగ్యాల నుంచి బయటపడినవాళ్లు, ఆశించిన శుభాలను పొందినవాళ్లు ఎంతోమంది వున్నారని అంటారు. ఇక్కడి భక్తాంజనేయస్వామికి భక్తితో ప్రదక్షిణలు చేస్తే చాలు, ఆయన వెన్నంటి కాపాడుతూ ఉంటాడనే ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.