హనుమకి ఇష్టమైన అప్పాలే నైవేద్యం !

వినయము ... వీరత్వము హనుమంతుడి సొంతం. దయచూపడంలోను ... దండించడంలోను ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయడు. తనకి ప్రీతిపాత్రులైనవారిని ఆయన నీడలా అనుసరిస్తూనే వుంటాడు ... కంటికి రెప్పలా కాపాడుతూనే వుంటాడు. అందుకే ఆయన ఆలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటాయి.

అలాంటి ఆలయాలో ఒకటి 'జానలదిన్నె' లో విలసిల్లుతోంది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామివారు వీరాంజనేయుడుగా కొలువుదీరి వుంటాడు. ప్రతి మంగళవారం ... శనివారాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.

స్వామివారికి సిందూరాభిషేకం ... ఆకుపూజను నిర్వహిస్తుంటారు. ప్రాచీనకాలం నుంచి ఇక్కడి హనుమంతుడు పూజలు అందుకుంటున్నాడనీ, ఆయన మహిమలు ఎంతోమంది అనుభవంలోకి వచ్చాయని చెబుతారు. హనుమంతుడికి అప్పాలంటే చాలా ఇష్టమనీ, వాటిని ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తే ప్రీతిచెందుతాడని అంటారు.

అలా ఆయన ప్రీతిచెందడం వలన ఆశించిన ఫలితం త్వరగా దక్కుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడి స్వామికి ప్రదక్షిణలు చేయడం వలన ... పూజాభిషేకాలు జరిపించడం వలన ... ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వలన అనతికాలంలోనే కోరికలు నెరవేరతాయని చెబుతారు. గ్రహసంబంధమైన దోషాలు ... దుష్టశక్తుల వలన కలిగే దుఃఖాలు దూరమవుతాయని అంటారు.


More Bhakti News