ఇసుక శివలింగాన్ని పూజిస్తే కలిగే ఫలితం
రావణాసురుడి తల్లి కైకసి ప్రతిరోజు సముద్రతీరాన ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి పూజించేది. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆమె ఇలా సైకతలింగాన్ని ఆరాధించేది. అలాగే ఎంతోమంది మహర్షులు ... రుషి పత్నులు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి పూజించి పునీతులయ్యారు.
ఇసుకతో తయారుచేసిన శివలింగాన్ని పూజించడం వలన 'మోక్షం' లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సాధారణంగా ఆలయాలలో నల్లరాతితోను ... తెల్ల రాతితోను రూపొందించిన శివలింగాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి. స్పటిక శివలింగాలు ... పాదరస శివలింగాలు అరుదుగా కనిపిస్తుంటాయి.
ఇక నిత్యం శివయ్యకి అభిషేకం చేసుకోవాలనుకునే వాళ్లు తక్కువ పరిమాణంలో గల శివలింగాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకుంటూ వుంటారు. అలాగే బంగారం .. వెండి ... ఇత్తడి వంటి లోహాలతో కూడా శివలింగాలను తయారు చేయించుకుంటూ వుంటారు. ఇక వివిధ పదార్థాలతో కూడా శివలింగాలను తయారు చేసుకుని పూజించవచ్చనేది ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. వీటిలో ఒక్కో శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుంది.
ఆయురారోగ్యాల కోసం ... అష్టైశ్వర్యాల కోసం ... అభీష్టసిద్ధి కోసం ఆయా శివలింగాలను పూజించడం జరుగుతూ వుంటుంది. ఈ నేపథ్యంలో సైకతలింగ పూజ మరింత విశేషాన్ని సంతరించుకుని వుంటుంది. సైకతలింగ ఆరాధన సాక్షాత్తు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందుకే మోక్షాన్ని కోరుకునేవాళ్లు ఎప్పటికప్పుడు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసుకుని పూజిస్తుంటారు. ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకుని తరిస్తుంటారు.