గంటను దానంగా ఇస్తే కలిగే ఫలితం !

దేవాలయ ముఖమంటపంలోకి అడుగుపెడుతూనే ముందుగా 'గంట' మోగించడం జరుగుతుంది. గంట ... ఓంకారాన్ని ధ్వనింపజేస్తుంది. అందువలన అసుర శక్తులు ఆలయ పరిసరప్రాంతాల్లోకి అడుగుపెట్టలేవు. గంట మోగించిన భక్తులు దైవీశక్తుల ప్రభావం కారణంగా శుభాలను పొందుతుంటారు.

ఆలయంలోను ... పూజామందిరంలోను దైవానికి ధూప దీప నైవేద్యాలను ... హారతిని సమర్పిస్తున్నప్పుడు తప్పనిసరిగా గంటను మోగిస్తుంటారు. గంటధ్వని మంగళకరమైనదిగా ... శుభప్రదమైనదిగా చెప్పబడుతోంది. అందువలన ముఖ్యమైన పనులపై బయలుదేరినవాళ్లు, గంటధ్వని వినిపించినప్పుడు శుభ సూచకంగా భావించి అడుగు బయటికిపెడుతుంటారు.

ఇంతటి విశిష్టతను సంతరించుకున్న గంటను ఆలయాల్లో దానంగా ఇవ్వడమనేది కొన్ని చోట్ల కనిపిస్తూ వుంటుంది. ఈ కారణంగానే కొన్ని ఆలయాల ప్రాంగణంలో చాలా గంటలు వ్రేలాడుతూ కనిపిస్తుంటాయి. తలపెట్టినకార్యాలు ఏదో ఒక కారణంగా ఆగిపోతున్నప్పుడు ... మనసులో బలంగావున్న ధర్మబద్ధమైన కోరికలు నెరవేరనప్పుడు గంటను దానంగా ఇవ్వడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుంది.

ఆపదలు ... అవాంతరాలు వచ్చిపడ్డప్పుడు గుడిలో గంటను దానంగా ఇవ్వడం వలన అవి తొలగిపోతాయి. అయితే దానంగా ఇచ్చే గంట నాణ్యమైనదై ... ఓంకారాన్ని పలికేదిగా ఉండేలా చూసుకోవాలి. సకలశుభాలకు సూచనగా చెప్పబడే గంటను గుడిలో దానంగా ఇవ్వడం వలన, అనుకున్న కోరిక నెరవేరడమే కాకుండా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News